Share News

Scams : పెద్దలను వదిలేసి... చిరుద్యోగులపై వేటు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:35 AM

ఇంటర్న్‌షిప్‌ను అందించే కంపెనీల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య అధికారులను వదిలేసి.. చిరుద్యోగులపై వేటు వేయడం విమర్శలకు తావిస్తోంది.

Scams : పెద్దలను వదిలేసి... చిరుద్యోగులపై వేటు!

  • ఇంటర్న్‌షిప్‌ అక్రమాలపై ఉన్నత విద్యామండలి తీరు వివాదాస్పదం

  • కంపెనీల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు

  • విమర్శలతో సమగ్ర విచారణకు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ ఇంటర్న్‌షిప్‌ అక్రమాల వ్యవహారంలో ఉన్నత విద్యామండలి తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఇంటర్న్‌షిప్‌ను అందించే కంపెనీల ఎంపికలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య అధికారులను వదిలేసి.. చిరుద్యోగులపై వేటు వేయడం విమర్శలకు తావిస్తోంది. దీంతో తీవ్ర విమర్శల నేపథ్యంలో మండలి దిద్దుబాటు చర్యలకు దిగింది. అక్రమాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా తణుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వారంలోగా నివేదిక ఇవ్వాలని అందులో ఆదేశించింది.

అసలేం జరిగిందంటే?

డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఏటా తప్పనిసరిగా ఇంటర్న్‌షి్‌పలు చేయాలి. డిగ్రీ విద్యార్థులు మొదటి ఏడాది కమ్యూనిటీ ప్రాజెక్టు పేరుతో క్షేత్రస్థాయిలో వారికి నచ్చిన అంశంపై ఇంటర్న్‌షిప్‌ చేయాలి. మొదటి రెండేళ్లు రెండు నెలల పాటు, మూడో సంవత్సరం ఆరు నెలల ఇంటర్న్‌షి్‌పలు చేయాలి. ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా వివిధ దశల్లో ఇంటర్న్‌షి్‌పలు పూర్తిచేయాలి. డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అందించేందుకు పలు కంపెనీలు ఉన్నత విద్యామండలి వద్దకు వెళ్తాయి. మండలి ఎంపిక చేసిన కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇందుకుగాను విద్యార్థుల నుంచి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తాయి. రాష్ట్రంలో ఏటా 2 లక్షల మందికిపైగా డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున కంపెనీలు పోటీపడతాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారులు మామూళ్లకు తెరతీశారు.


డబ్బులిచ్చిన కంపెనీలను ఎంపిక చేసేలా అక్రమాలు ప్రారంభించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వాస్తవమేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అక్రమాలకు బాధ్యులను చేస్తూ మండలి వైస్‌ చైర్మన్‌ వద్ద పనిచేసే ఓ అటెండర్‌ను, కేపీఎంజీకి చెందిన మరో కింది స్థాయి ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కానీ అసలు వారి వెనుక ఎవరున్నారనేది వదిలేశారు. పది రోజుల తర్వాత ఇప్పుడు విచారణాధికారిని నియమించారు. కాగా, గత ప్రభుత్వం నుంచి పనిచేస్తున్న ఇద్దరు కీలక అధికారులు, మరో ముఖ్య అధికారి ఈ అక్రమాల వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీల ఎంపికలో వారే కీలకంగా వ్యవహరించి.. చివరికి ఆ నెపాన్ని చిరుద్యోగులపై నెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ హయాంలో అన్నీ అక్రమాలే!

గత ప్రభుత్వంలో ఇంటర్న్‌షి్‌పల పేరుతో భారీగా దోపిడీ చేశారు. ఆన్‌లైన్‌లో లక్షల మందికి ఇంటర్న్‌షి్‌పలు, నైపుణ్య శిక్షణ ఇచ్చామంటూ భారీగా నిఽధులు విడుదల చేశారు. ఈ క్రమంలో అసలు లేని ఆఫీసుకు రూ.51 లక్షలు విడుదల చేయడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురిచేసింది. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బక్స్‌ అనే కంపెనీకి నామినేషన్‌ ఆధారంగా కాంట్రాక్టు అప్పగించారు. మండలి కార్యాలయం పక్కనే మంగళగిరిలో ఆఫీసు ఉన్నట్టుగా చూపించి రూ.51 లక్షలు ఆ కంపెనీకి ఇచ్చారు. విద్యార్థులకు కోడింగ్‌, ఇంగ్లిష్ పై శిశిక్షణ ఇచ్చినట్లు చూపించారు. దీనిపై విమర్శలు వచ్చినా ఎక్కడ శిక్షణ ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. అప్పట్లో మండలి ముఖ్య అధికారులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వారిలో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నా.. విచారణ చేపట్టడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 03:35 AM