Farooq Basha Withdraws Case: రఘురామపై కేసు కొనసాగించలేను
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:28 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కేసును ఇక కొనసాగించలేనని సుప్రీంకోర్టుకు
సుప్రీంకు తెలిపిన కానిస్టేబుల్ ఫరూక్ బాషా
న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కేసును ఇక కొనసాగించలేనని సుప్రీంకోర్టుకు ఫిర్యాదుదారు కానిస్టేబుల్ ఫరూక్ బాషా తెలిపారు. హైదరాబాద్ నుంచి తన (ఏపీలోని) నివాసం 400 కిలోమీటర్లు ఉన్నదని, ఇకపై ఆ కేసులో ముందుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లోని రఘురామకృష్ణరాజు నివాసం వద్ద ఒక వ్యక్తి (ఏపీ ఇంటెలిజెన్స్ కాని ేస్టబుల్ ఎస్‌కే ఫరూక్ బాషా) అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ఆయన భద్రతా సిబ్బంది పిలిచి విచారించారు. ఐడీ, ఆధార్ కార్డులు చూపించేందుకు తొలుత ఆ వ్యక్తి నిరాకరించారు. అనుమానంతో ఆ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులకు రఘురామ భద్రతాసిబ్బంది అప్పగించారు. అక్కడి విచారణలో ఆయన ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన కానిస్టేబుల్ ఫరూక్ బాషా అని తెలిసింది. ఆయనపై రఘురామ కృష్ణరాజు పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని ఫరూక్ బాషా సైతం పోలీస్ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ రఘురామ కృష్ణరాజుతోపాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. తనతోపాటు తన కుమారుడు, ఇతరులపై కేసును క్వాష్ చేయాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. హైకోర్టు తీర్పుని రఘురామ కృష్ణంరాజు 12 జూలై 2022న సుప్రీకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తొలుత.. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ‘‘రఘురామ కృష్ణంరాజు ఈ కేసు నమోదైనప్పుడు పార్లమెంట్ సభ్యుడు. ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తి సంచరించడాన్ని గమనించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆయనను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి సీఆర్పీఎఫ్ సిబ్బందిని, రఘురామ కుమారుడిని గాయపరిచారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మాత్రం వాళ్లకే వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. ఆయన ఇంటి వద్దకు వచ్చిన వ్యక్తిని సందేహంతో ప్రశ్నిస్తే.. ఇదంతా జరిగింది. ఇదంతా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో రఘురామ కృష్ణరాజుకు ఉన్న విబేధాలు, ఘర్షణల కారణంగానే జరిగింది..’’ అని ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సమగ్రంగా రీజాయిండర్ రూపంలో దాఖలు చేశారని ధర్మాసనం ఆదేశించగా, మూడు వారాల్లో అందజేస్తామని బదులిచ్చారు. రఘురామ కృష్ణరాజు ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారా? అని జస్టిస్ మహేశ్వరి ప్రశ్నించారు. ఆయన డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్నారని ఆదినారాయణరావు బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే, ఫిర్యాదుదారు ఫరూక్‌బాషా పోలీస్ స్టేషన్ లో కేసును కొనసాగించేందుకు సిద్ధంగా లేరని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News