Coffee Berry Borer: ప్రమాదంలో అరకు కాఫీ
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:53 AM
అరకు కాఫీకి కొత్త సమస్య వచ్చింది. గిరిజన ప్రాంతంలో తొలిసారి కాఫీ బెర్రీ బోరర్ తెగులు బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ పంటను తీవ్ర స్థాయిలో నాశనం చేసే తెగులు కాఫీ బెర్రీ బోరర్ ..
గిరిజన ప్రాంతంలో తొలిసారిగా బయటపడ్డ కాఫీ బెర్రీ బోరర్ తెగులు
గుర్తించిన కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు
యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు
చింతపల్లి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): అరకు కాఫీకి కొత్త సమస్య వచ్చింది. గిరిజన ప్రాంతంలో తొలిసారి కాఫీ బెర్రీ బోరర్ తెగులు బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ పంటను తీవ్ర స్థాయిలో నాశనం చేసే తెగులు కాఫీ బెర్రీ బోరర్ (హైపోథెనెమస్). కాఫీ బెర్రీ బోరర్ అనే కీటకం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. ఈ కీటకం కాఫీ కాయ/పండు దశలో రంధ్రం చేసుకుని లోపలకుప్రవేశిస్తుంది. కాఫీ పండు/కాయలో ఉన్న గింజను పూర్తిగా తొలిచివేసి సొరంగం మాదిరిగా చేసుకుని గుడ్లు పెడుతుంది. ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ కాయ/పండు లోపల ఏర్పాటు చేసుకున్న సొరంగంలో గుడ్లు పెడుతుంది. 35 రోజులకు ఒక గింజ నుంచి 30-40 కీటకాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన కీటకాలు ఇతర కాఫీ కాయల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పద్ధతిలో కాఫీ కాయలు/పండ్లను కీటకాలు పూర్తిగా నాశనం చేస్తాయి. ఈ తెగులు అత్యంత ప్రమాదకరం. ఇది కాఫీ తోటల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధి అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో ప్రప్రథమంగా కాఫీ బెర్రీ బోరర్ తెగులును వారం క్రితం కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పకనకుడి గ్రామంలోని సిరగం సువర్ణకు చెందిన ఎకరా కాఫీ తోటలో గింజలకు కాఫీ బెర్రీ బోరర్ తెగులు కనిపించింది. పకనకుడి గ్రామంతో పాటు పరిసర మాలిసింగరం, మాలివలస, తుర్రయిగూడు, మంజగూడలోనూ కొన్ని మొక్కల్లో ఈ తెగులు కనిపించినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు ప్రారంభించారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులు గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తెగులుపై గిరిజన రైతులు అప్రమత్తం కావాలని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..