CM Orders Immediate Onion Purchase: ఉల్లి రైతు నష్టపోకూడదు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:17 AM
ఉల్లి రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వింటాకు రూ.1,200 చొప్పున చెల్లించి, రైతుల నుంచి తక్షణమే కొనుగోలు చేయాలని, వాటిని రైతుబజార్లలో..
తక్షణమే క్వింటా రూ.1,200కు కొనుగోలు
మార్కెటింగ్‌శాఖకు సీఎం ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వింటాకు రూ.1,200 చొప్పున చెల్లించి, రైతుల నుంచి తక్షణమే కొనుగోలు చేయాలని, వాటిని రైతుబజార్లలో విక్రయించాలని మార్కెటింగ్‌శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ఉల్లి రైతుల ఇబ్బందులపై గురువారం అమరావతి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉల్లి పంట దెబ్బతినడం, మహారాష్ట్రలో ఉల్లి ఎక్కువగా ఉన్నందున ధరల విషయంలో మన రాష్ట్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు చెప్పారు. 10 రోజుల్లో 5 వేల టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ‘ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు. క్వింటా రూ.1,200 చొప్పున తక్షణం కొనుగోలు చేయండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించండి. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. అనంతరం రైతుబజార్లకు తరలించి విక్రయించాలి. ఉల్లి రేటు వచ్చేంత వరకూ కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేలా రైతులకు అవకాశం కల్పించండి. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి’ అని నిర్దేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల స్పెషల్ సీఎస్ రాజశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతుబజార్ల సంఖ్య 200కు పెంచాలి
రాష్ట్రంలోని రైతుబజార్ల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు మార్కెటింగ్‌శాఖను ఆదేశించారు. ‘ప్రస్తుతం ఉన్న 150 రైతుబజార్ల సంఖ్యను 200కు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డు స్థలాలను వినియోగించాలి. ధరల నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..