CM Chandrababu Naidu: మీకేమీ పట్టదా
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:37 AM
మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
చేసిన మంచినీ చెప్పరా.. దుష్ప్రచారం అడ్డుకోలేరా?
మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం
జరుగుతున్న పరిణామాల పట్ల మంత్రులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. వాటిపై
ఎప్పటికప్పుడు స్పందించాలి. లేకుంటే రాజకీయంగా చాలా నష్టపోతాం.
- చంద్రబాబు
ఆడవాళ్లంటే వైసీపీ నేతలకు చులకన. మహిళలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతిని వేశ్యల రాజధాని అనడం, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలు దీనికి నిదర్శనం.
- సీఎం చంద్రబాబు
గంజాయి నియంత్రణపై మరింతగా ఉక్కుపాదం మోపాలి. ఈగల్ టీంలు ఇంకా సమర్థంగా పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి.
- సీఎం చంద్రబాబు
తోతాపురి మామిడికి కిలోకు రూ.4 అదనంగా ఇచ్చి కొనిపించాం
80% కొనేశాక జగన్ హడావుడి
రైతుల వద్దకు వెళ్లి తలకాయలు రప్పా రప్పా నరుకుతామంటారా?
ఎక్కడా లేని విధంగా పొగాకును 275 కోట్లు వెచ్చించి కొనిపించాం
నిత్యావసరాల ధరలు తగ్గించాం
మహిళా ఎమ్మెల్యేను దూషించినా మీరు స్పందించరా?
మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉదాసీనత
దీంతో ప్రజల్లో వైసీపీ దుష్ప్రచారం
క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులకు చంద్రబాబు క్లాసు
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి వైసీపీ నేతలు నీచంగా మాట్లాడితే వెంటనే ఎందుకు స్పందించలేదని బుధవారం మంత్రివర్గ సమావేశంలో నిలదీశారు. ఈ భేటీ మూడున్నర గంటలపాటు జరిగింది. ఎజెండా అంశాలను చర్చించాక.. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి తన సహచరులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా వాటిని సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేస్తే వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పికొట్టలేకపోయారని ఆక్షేపించారు. ‘తోతాపురి మామిడికి కిలోకు రూ.4 అదనంగా ఇచ్చి కొనుగోలు చేయించాం. మామిడి కొనుగోళ్లు 80శాతం పూర్తయ్యాక జగన్ బంగారుపాళ్యంలో పర్యటన పేరుతో హడావుడి చేశారు.
వైసీపీ రైతుల పొలాల నుంచి తీసుకొచ్చిన మామిడి పండ్లను ఉద్దేశపూర్వకంగా కింద పోయించి అలజడి సృష్టించారు (వాటికి సంబంధించిన విజువల్స్‌ను మంత్రివర్గ సహచరులకు సీఎం చూపించారు). మామిడి రైతుల వద్దకు వెళ్లి.. తలకాయలు రప్పా రప్పా నరుకుతామని హెచ్చరించడం ఏమిటి? అనుమతుల్లేకున్నా రోడ్‌షోలు, మందీమార్బలంతో బలప్రదర్శనలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. వారికి చట్టాలపై గౌరవం లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పొగాకును రూ.275 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయించాం. నిత్యావసరాల ధరలను ఏడాదిలో గణనీయంగా తగ్గించాం (ఏ వస్తువు ధర ఎంత మేర తగ్గిందో చదివి వినిపించారు). ఇలాంటి మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చేసిన మంచి చెప్పుకోలేకపోవడం వల్ల.. వాటిని వైసీపీ వాళ్లు తమకు అనువుగా వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సీఎం అన్నారు. ఇండోసోల్‌కు భూములు ఇవ్వొద్దని రైతుల్ని రెచ్చగొట్టింది జగనేనని.. అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో కథనాలు రాయిస్తున్నారని.. ఇలాంటి కుట్రల్ని సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. ప్రభుత్వం సరిచేసుకోవాల్సిన అంశాలు ఉంటే వెంటనే చేద్దామని వ్యాఖ్యానించారు.
ఏం చేశామో చెప్పలేరా?
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా మంత్రులందరికీ వారి శాఖల్లో ఏడాదిలో చేసిన అభివృద్ధి పనులను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశించారు. మంత్రి సత్యకుమార్ తప్ప మిగిలిన వారెవ్వరూ ఆ పని చేయకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని పదేపదే చెబుతున్నా.. ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్‌పాయిజనింగ్, అతిసార వంటివి చోటుచేసుకుంటున్నాయని.. మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని సీఎం సూచించారు.
రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం డిసెంబరులోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు అక్కడ నివాసం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
తొలి అడుగుకు స్పందన ఎలా ఉంది?
కేబినెట్ భేటీకి ముందు సీఎం నివాసంలో మంత్రులకు లోకేశ్ అల్పాహారం విందు ఇచ్చారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి స్పందన ఎలా ఉందని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, తల్లికి వందనం డబ్బులు పడలేదని.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా వేయలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన అంశాలపై ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతోందని తెలిపారు.
ఈ-మెయిళ్ల కుట్రపై విచారణ: బాబు
ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ వారు ఈ-మెయిళ్లు పెట్టడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు అడ్డుకునేలా చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, పేదలకు తల్లికి వందనం డబ్బులు అందకుండా చేయడమే లక్ష్యంగా ఈ-మెయిళ్ల తంతు నడిపారని వ్యాఖ్యానించారు.