Share News

CM Chandrababu : స్పీడ్ పెంచేద్దాం !

ABN , Publish Date - Feb 12 , 2025 | 03:44 AM

వేగం పెంచాల్సిందే’’ అని అన్ని శాఖల కార్యదర్శులు, ఆపైస్థాయి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

CM Chandrababu :  స్పీడ్ పెంచేద్దాం !

  • 8 నెలల కృషితో మంచి ఫలితాలు: ముఖ్యమంత్రి

  • కీలక సమయంలో అలసత్వం కుదరదు.. అధికారులు కొత్తగా ఆలోచించాలి

  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విధానాలను పరిశీలించండి

  • డబ్బుల్లేవని ఆలోచనలను ఆపొద్దు

  • తక్కువ వ్యయంతో, కేంద్రం మద్దతుతో అమలు చేసేలా ప్రణాళికలు

  • సీఎంవో స్థాయిలో ‘ఇన్నోవేషన్‌ సెంటర్‌’

  • ముగ్గురు అధికారులతో కమిటీ

  • ఇంట్లో కూర్చుంటే సమస్యలు తెలియవు

  • ప్రతి నెలా 3-4 జిల్లాల్లో తిరగాలి

  • సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం

  • అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

  • సూటిగా సాగిన ‘కార్యదర్శుల సదస్సు’

‘‘మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. 8 నెలల్లో మనం చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనికి సమష్టి కృషే కారణం. ఇది ప్రారంభం మాత్రమే. మునుముందు మరిన్ని ఫలితాలు వస్తాయి.’’

- చంద్రబాబు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘ఇప్పుడిప్పుడే పాలన గాడిన పడుతోంది. కీలకమైన ఈ సమయంలో నిర్లిప్తత, అలసత్వం కుదరదు. వేగం పెంచాల్సిందే’’ అని అన్ని శాఖల కార్యదర్శులు, ఆపైస్థాయి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలాంటి రాగద్వేషాలకు తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగమైన పరిపాలన అందించాలన్నారు. ఆయన మంగళవారం సచివాలయంలో కార్యదర్శులు, మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా కలెక్టర్ల సదస్సు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఆ మరుసటి రోజూ నిర్వహించిన సందర్భాలున్నాయి. తొలిసారిగా కార్యదర్శులతో ఉదయం నుంచి రాత్రిదాకా దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అదీ మూసపద్ధతిలో కాకుండా... సూటిగా, స్పష్టంగా దిశా నిర్దేశం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన విధానాలు, ప్రజోపయోగ పథకాలపై అధ్యయనం చేయాలని... వాటిలో రాష్ట్రంలోని పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఉండేవాటిని ఎంపిక చేసి ఒక నివేదిక ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించారు. వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. ‘‘డబ్బుల్లేవు... ఇది చేయలేం అని మంచి ప్రతిపాదనలు, ఆలోచనలను పక్కన పడేయవద్దు. తక్కువ వ్యయంతోనే వాటిని అమలు చేయడంపై ఆలోచించండి.


వాటికి కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు తీసుకోవచ్చో చూడండి’’ అని స్పష్టం చేశారు. దీనికోసం సీఎంవో స్థాయిలో ‘ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటికప్పుడే సౌరభ్‌ గౌర్‌, కాటమనేని భాస్కర్‌, కోన శశిధర్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

జిల్లాలకు వెళ్లండి...

‘రేసుగుర్రాల్లో జోష్‌ ఏదీ’ అంటూ అధికారుల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇందులోని అంశాలను ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఐఏఎ్‌సలకు సమాజంలో మంచి పేరుంది. మీరు సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్ముతారు. మంచి స్థానాల్లో ఉన్నారు... మంచి చేయాలి’’ అని హితవు పలికారు. ఇళ్లలో కూర్చుని పని చేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియవన్నారు. గ్రూప్‌-1 అధికారులనుంచి ప్రతి ఒక్కరూ ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా కనీసం మూడు నాలుగు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. అధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రణాళిక రూపొందిస్తారని చెప్పారు.

ఫిర్యాదులు ఎందుకొస్తున్నాయి?

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా రెవెన్యూ, వైద్య, పోలీసు, విద్యా శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. ‘దీనికి కారణాలేమిటో తెలుసుకోండి. సమస్యలు పరిష్కరించండి. వాటిని సరైన కోణంలో చూడండి. అంతే తప్ప... ఫిర్యాదు చేసిన వారిపై విసుక్కోవద్దు’’ అని హితవు పలికారు. ‘‘ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయంటే... ఆ శాఖ సరిగా పనిచేయనట్టే లెక్క. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలుగా మారే పరిస్థితి వస్తోంది. నిర్దిష్ట సమయంలో వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీదే’’ అని అధికారులకు స్పష్టం చేశారు. సులువుగా, సరళంగా పౌర సేవలు అందించేందుకు ఉద్దేశించిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ను సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. ‘పాలనను సరళీకరించాలి. ఇందుకు టెక్నాలజీయే మార్గం’’ అని తెలిపారు.


సూటిగా... స్పష్టంగా...

కలెక్టర్ల సదస్సుతో పోల్చితే మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల భేటీ సూటిగా, స్పష్టంగా సాగింది. సూదీర్ఘంగా సాగే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లకు కళ్లెం వేశారు. కేటాయించిన సమయం పూర్తికాగానే ‘మైక్‌ కట్‌’ చేసేశారు. ఇక... చంద్రబాబు ‘ఎవరినీ ఉద్దేశించి అనడం లేదు’ అంటూనే... తాను అనాల్సిన వారికి అర్థమయ్యేలా చురకలు అంటించారు. సమయ పాలన, ఫైళ్ల కదలిక, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం... తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. కీలక శాఖల నుంచి సూక్ష్మస్థాయిలో సమాచారం తెప్పించుకున్నారు. ప్రజెంటేషన్‌లో లోపాలను అప్పటికప్పుడే ఎత్తిచూపించారు. గత ఎనిమిది నెలల్లో ఏం సాధించారు... భవిష్యత్‌ లక్ష్యాలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌ ప్రణాళిక లేకుండా వచ్చిన అటవీ, పర్యాటక శాఖ అధికారులపై ఆగ్రహించారు. అలాగే... పూర్తిస్థాయి సమాచారం లేకుండా వచ్చిన వారినీ మందలించారు. ‘తర్వాత చెబుతామంటే... ఇప్పుడు మీటింగ్‌ పెట్టడం ఎందుకు?’ అని ప్రశ్నించారు. అటవీశాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మేం ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. మీ ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు’’ అని సూచించారు. ఈసారి జరిగే కలెక్టర్ల సదస్సుల్లో... జిల్లా కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని వారికి గైడ్‌ చేయాలే తప్ప.. లీడ్‌ చేయొద్దని చంద్రబాబు అన్నారు. శాఖల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని మంత్రులను కూడా ఆదేశించారు. ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏడు అంశాలపై అందరు అధికారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. ఇంకా కొన్ని శాఖలపై రివ్యూ పెండింగ్‌లో ఉన్నప్పటికీ... ‘మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టను’ అంటూ చంద్రబాబు రాత్రి 9 గంటలకు సమీక్షను ముగించారు.


ఇవీ ఆదేశాలు...

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఆర్థికంతో సంబంధం లేనివాటిని వెంటనే పరిష్కరించాలి. అసాధ్యమైన సమస్యలు ఉంటే వాటిపై తగిన వివరణ ఇవ్వాలి.

ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న 5 జోన్లకు కూడా ఉన్నతాధికారులు వెళితే చాలా ఆలోచనలు వస్తాయి.

వృద్ధిరేటు (జీఎస్‌డీపీ) 15 శాతం సాధించకపోతే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేదు. అది సాధించాల్సిందే!

ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే అది ఎప్పుడు పూర్తవుతుందనే క్లారిటీ ఉండాలి. ఇందుకోసం మిషన్‌ కర్మయోగి, ప్రాజెక్టు మోనిటరింగ్‌ గ్రూప్‌ (పీఎంజీ)లను ఎడాప్ట్‌ చేసుకోవాలి.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చే ప్రధాన హామీలన్నీ అమలు చేయాల్సిందే.

ఉగాది పండుగ నుంచి ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం.


Also Read: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Updated Date - Feb 12 , 2025 | 03:47 AM