Share News

CM Chandrababu: సింగపూర్‌లో రెండో రోజు.. సీఎం బిజీ బిజీ

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:12 PM

సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రెండో రోజు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు పర్యటన సాగుతోంది.

CM Chandrababu: సింగపూర్‌లో రెండో రోజు.. సీఎం బిజీ బిజీ
CM Chandrababu in Singapore

అమరావతి, జులై 28: సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు బృందం సందర్శించింది. ఆ క్రమంలో పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజినల్ సీఈవో విన్సెంట్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్ట్‌గా టువాస్ పోర్టును నిర్మిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు సింగపూర్ అథారిటీ అధికారులు వివరించారు. అనంతరం ఆ పోర్టులోని ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను సీఎం చంద్రబాబుతోపాటు ప్రతినిధి బృందం పరిశీలించింది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కోస్తా తీరం అధికంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని పోర్టుల నిర్మించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈ పోర్టుల్లో ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీ వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో టువాస్ పోర్టును సీఎం చంద్రబాబుతోపాటు ఆయన ప్రతినిధి బృందం సందర్శించింది.


పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలో టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు ఎంత వరకు ఉపయోగపడతాయనే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు బృందం అధ్యయనం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలు, కార్యాకలాపాలు, నిర్వహణపై టువాస్ పోర్టు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


రాష్ట్రంలోని పోర్టులను.. సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై ఆ దేశ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పి. నారాయణ, టీజీ భరత్‌తోపాటు పలువురు అధికారులు సందర్శించారు.


బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జులై 26 నుంచి 31వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశం కానున్నారు. ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను వారికి సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించనున్నారు. అందులో భాగంగా వారిని ఏపీకి ఆహ్వానించనున్నారు.


ఇక ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించనున్నారు. సింగపూర్‌లో నిర్వహించే రోడ్ షోకు ఆయన హాజరవుతారు. అదే విధంగా ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సంస్థలను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట.. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి రోజు.. జస్ట్ ఇలా చేయండి..

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

Updated Date - Jul 28 , 2025 | 05:45 PM