CM Chandrababu: చరిత్ర సృష్టించాం
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:41 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖవేదికగా సూపర్‌హిట్ అయిందని, ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పజల సహకారంతో సూపర్ హిట్
యోగాను ఒలింపిక్స్‌లో చేర్చాలి
ప్రధాని చొరవ తీసుకోవాలి: సీఎం
యోగాంధ్రలో 2 గిన్నిస్ రికార్డులు
30 కి.మీ 3,03,654 మందితో యోగా
22,122 మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు
ఒకేరోజు 23 రికార్డులు నమోదు
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖవేదికగా సూపర్‌హిట్ అయిందని, ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగాను కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో చేర్చేలా ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి పదేళ్ల కృషి ఫలించిందని, ఏపీలో ఒక్కరోజే 12 లక్షల చోట్ల 2.17 కోట్లమంది యోగాలో భాగస్వామ్యులయ్యారన్నారు. యోగా కొందరిది కాదు.. అందరిదనే భావనను ప్రధాని తీసుకొచ్చారని కొనియాడారు. అందువల్లే ఉదయం 6గంటలకే రావాలని పిలుపునిస్తే...తెల్లవారుజామునే చేరిపోయారని, ప్రకృతి కూడా సహకరించిందన్నారు. మొత్తం 3,03,654 మంది విశాఖలో పాల్గొన్నట్టు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తేలిందని, ఇది గిన్నిస్ రికార్డు అన్నారు. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాలపాటు సూర్య నమస్కారాలు చేయడంతో రెండో రికార్డ్ సొంతమైందన్నారు. దీనికి అదనంగా మరో 21 రికార్డులు సాధించి చరిత్ర సృష్టించామని తెలిపారు.
శనివారం విశాఖ బీచ్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ, కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 2.45 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 25 వేల మందికి ధ్రువపత్రాలు ఇద్దానుకుంటే, ఆ సంఖ్య 1.8 లక్షలకు చేరింది.’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ప్రధానికి మించిన వారులేరు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలామందికి అర్థంకావడం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న భారతీయ సంతతి వారి తలసరి ఆదాయం మిగిలిన వారి కంటే ఎక్కువగా ఉంది. మంచి ఆలోచనలు, విజ్ఞానం ఉన్నవారు సాంకేతికతను అందిపుచ్చుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.’’
యోగాంధ్రకు 2 గిన్నిస్ రికార్డులు
30.16 కి.మీ.లో 3,03,654 మందితో యోగా
22,122 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలకు
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల మేర 3,03,654 మందితో చేపట్టిన యోగా ప్రదర్శన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 2023లో గుజరాత్‌లోని సూరత్‌లో 1.47 లక్షల మందితో యోగా నిర్వహించడమే ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించినట్టయింది. అలాగే, శుక్రవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కింది. ఈ రెండు రికార్డులకు సంబంధించిన పత్రాలను మంత్రి నారా లోకేశ్‌కు గిన్నిస్ బుక్ ప్రతినిధులు శనివారం ఆర్కే బీచ్‌రోడ్డులోని యోగా ప్రధాన వేదిక వద్ద అందజేశారు.
రుషికొండ’పై కోట్లు ఖర్చుచేసినవారా నన్ను విమర్శించేది?
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా చేశారంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కొందరు విలేకరులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇలాంటి సందర్భాలలో కొందరి గురించి మాట్లాడడం అనవసరం. రుషికొండపై ప్యాలె్‌సకు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చుచేసిన వాళ్లా నన్ను విమర్శించేది? ప్రజల సొమ్మును ప్రజాహితం కోసం ఖర్చుచేయాలి తప్ప వ్యక్తిగత విలాసాలకు కాదు. రాష్ట్రాన్ని కలుషితం చేద్దామనుకునేవారి చర్యలను ఉపేక్షించబోను. ఇటువంటి భూతాన్ని నియంత్రించడానికి ప్రజల్ని చైతన్యపరుస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్రం రూ.75 కోట్లు ఖర్చు చేసింది’’ అని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, నేరాలు చేసి తప్పించుకునే వారిని, ఆడబిడ్డల జోలికి వచ్చే వారినీ వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కుప్పం వంటి చోట్ల డబ్బులు ఇవ్వలేదని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. నేరప్రవృత్తి ఉన్నవారికి గత ప్రభుత్వ హయాంలో భయం పోయిందని, అటువంటి వారికి ఒకటి కాదు రెండుసార్లు చెబుతానని, అప్పటికీ మారకపోతే గింగిర్లు తిరిగేలా ట్రీట్‌మెంట్ ఇస్తానని హెచ్చరించారు. ప్రజాహితం, ప్రజాభద్రతే ముఖ్యమని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు తీవ్రవాదంపై పోరాటం చేశానని, చివరకు తనపై దాడి చేసినా వెరవలేదన్నారు. రాయలసీమలో ముఠా కక్షలను అణిచివేశానని, హైదరాబాద్‌లో మత కల్లోలాలను ఉక్కుపాదంతో నిర్మూలించానని తెలిపారు. విశాఖలో గంజాయి నిర్మూలనకు త్వరలో కార్యాచరణ రూపొందించి అమలుచేస్తామని చంద్రబాబు వివరించారు.
గిరిజన విద్యార్థులకు అభినందనలు
విశాఖ ఏయూ మైదానంలో 108 నిమిషాలపాటు 21,122 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. ఆ విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించారు. 26 జిల్లాల్లో 26 థీమ్‌ల ఆధారిత యోగా చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘‘101 పర్యాటక ప్రదేశాల్లో యోగా నిర్వహించాం. సూరత్‌లో 1.47 లక్షల మందితో గిన్నిస్ రికార్డును నెలకొల్పగా, ఇప్పుడు మూడు లక్షలకుపైగా జనంతో నిర్వహించి కొత్త రికార్డు సాధించాం. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ డిక్లరేషన్‌ను త్వరలో తీసుకువస్తాం. విశాఖలో యోగా అకాడమీ నెలకొల్పుతాం. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు ఈ ఏడాది రూ.18 వేల కోట్లు కేటాయించాం. అవిగాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.ఐదువేల కోట్ల కుపైగా ఖర్చుచేస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.