CM Chandrababu Naidu: ఆ భూతం మళ్లీ రాదు
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:40 AM
వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు.
వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి అధిక ప్రోత్సాహకాలు
సమాజంలో అసమానతల్ని తొలగించాలి
విధాన నిర్ణేతగా అది నా బాధ్యత
ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు వెల్లడి
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి
పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు
అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘ఏపీకి నేను తీసుకొచ్చిన బ్రాండ్‌ను గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్లీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అలా జరగదు.. భయం వద్దు.. ఆ భూతం మళ్లీ రాదు. దానికి నాదీ హామీ.. నేను ఈసారి ఏమరుపాటుగా లేను. ఈ ప్రభుత్వమే కొనసాగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభు త్వ సహకారంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి. మోదీ నాయకత్వంలో 11 ఏళ్లుగా దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పని చేస్తున్నాం. 2.47 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియం ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కాబట్టి గత ఐదేళ్ల పాలనను పెట్టుబడిదారులు మరిచిపోవాలి. ఎలాంటి భయాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.’’ అని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్థన్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్, ఏపీ చైర్మన్ ఎం.ప్రభాకర్‌రావు, డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..
సీమకు గ్రీన్.. ఉత్తరాంధ్రకు గూగుల్..
‘‘పాలసీ మేకర్‌గా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడం నా బాధ్యత. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పే కంపెనీలకు ఎక్కువ ప్రోత్సాహకాలు అందిస్తాం. రాష్ట్రంలో వెయ్యి కిమీ తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 20 పోర్టులు నిర్మిస్తున్నాం. మరో 15 విమానాశ్రయాలు ఏర్పాటుచేస్తున్నాం. అత్యంత కీలకమైన కలకత్తా-చెన్నై, చెన్నై-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు పురోగతిలో ఉన్నాయి. కలకత్తా-చెన్నై రైలు మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ రూ. 1.45 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. బీపీసీఎల్ రూ. ఒక లక్ష కోట్లు, ఎల్జీ సంస్థ శ్రీసిటీలో రూ 5 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తెచ్చి.. 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు అనువైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి.. మీరూ అభివృద్ధి చెందండి.’’
పెట్టుబడులు రావాలి.. పేదరికం పోవాలి
‘‘పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి సంపద పెరుగుతుంది. ఆ సంపదను సంక్షేమం రూపంలో పేదలకు అందిస్తాం. ప్రభుత్వాధినేతగా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడం నా ముందున్న ఏకైక లక్ష్యం. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ముందుకు రావాలి. సమాజంలో ఒకవైపు మిలియన్, ట్రిలియన్ డాలర్ల ఆస్తిపరులు ఒకవైపు.. పూటగడవని అభాగ్యులు మరోవైపు ఉన్నారు. ఈ అసమానతలను తొలగించడమే మా ప్రభుత్వ ప్రఽథమ ప్రాధాన్యం. సమాజం నుంచి ఎంతో తీసుకుని అభివృద్ధి చెందినవారు.. ఇప్పుడు సమాజానికి సేవల చేయాల్సిన సమయం వచ్చింది. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకే ప్రభుత్వం పీ-4 విధానాన్ని ప్రమోట్ చేస్తోంది. దీనికి పారిశ్రామికవేత్తలందరూ సహకరించాలి.’’
ఒకప్పుడు ఐటీతో అభివృద్ధి..ఇప్పుడు డేటాతో సంపద
‘‘ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేశాను. ఫలితంగా మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలతో హైదరాబాద్ ఇప్పుడు ఐటీ కేంద్రంగా మారింది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐలపై ఫోకస్ పెట్టాం. సమాచారం అతి పెద్ద ఆస్తిగా మారుతున్న ప్రస్తుత కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ సమీప భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనుంది. టెక్నాలజీ ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు సామాన్యులకు మెరుగైన సేవలు అందించవచ్చు. నేరాలను కట్టడి చేయవచ్చు. డ్రోన్లతో పోలీసు పెట్రోలింగ్ చేయవచ్చు. ఎక్కువమందితో చేసే పనిని ఒక్క డ్రోన్‌తోనే చేయవచ్చు. మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆసుపత్రుల ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజారోగ్య పరిరక్షణకు టెక్నాలజీని ఏవిధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై బిల్‌గేడ్స్ ఫౌండేషన్‌తో కలిసి కసరత్తు చేస్తున్నాం. నవంబరు నాటికి రాష్ట్రంలో చిన్నపిల్లలతోసహా అందరికీ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. దాదాపు 50 అంశాలకు సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తుఫాన్లు, వరదల వంటి విపత్తులపై 95ు కచ్చితత్వంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేయవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఏపీని ప్రపంచంలోనే పర్యావరణంలో అగ్రగామిగా నిలపాలనేది లక్ష్యం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నాటికి 703 సేవలను అందిస్తాం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో వాయిస్ ఆధారిత బస్సు రిజర్వేషన్ సేవలనూ అందుబాటులోకి తీసుకురానున్నాం’’.
దావో్‌సకు తొమ్మిది సార్లు వెళ్లాను
రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలవకూడదనే అపోహ ఒకప్పుడు ఉండేదని, అందుకే పారిశ్రామిక సదస్సుల్లో ప్రభుత్వం నుంచి ఎవ్వరూ పాల్గొనేవారు కాదని సీఎం గుర్తుచేశారు. దావోస్ సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రి తానేనని, ఇప్పటికి 9 సార్లు వెళ్లానని తెలిపారు. గతంలో ఎవరూ విజన్ డాక్యుమెంట్లు రూపొందించేవారు కాదని, ఉమ్మడి ఏపీ సీఎంగా తాను రూపొందించిన విజన్-2020తో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ. 500 నోట్లు కూడా రద్దు చేసి.. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలన్నారు.
పారిశ్రామికవేత్తలతో మాటామంతీ
పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. ‘‘వాజపేయి హయాంలోనే భారతదేశం ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలని ఆలోచన చేసింది. కానీ ఇప్పటివరకు సాకారం కాలేదు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఏపీలో క్రీడలకు సంబంధించి అమరావతిలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించాం’’ అని వివరించారు.