Share News

CM Chandrababu Health Review: అప్రమత్తతతో అందరికీ ఆరోగ్యం

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:19 AM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కాదు.. వారు వ్యాధుల బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు

CM Chandrababu Health Review: అప్రమత్తతతో అందరికీ ఆరోగ్యం

వ్యాధుల నియంత్రణకు ముందు జాగ్రత్తలు అవసరం

  • ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి ఆమోదం

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కాదు.. వారు వ్యాధుల బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ పనితీరు, టాటా డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ సేవలు, మెడికల్‌ కాలేజీల నిర్మాణం.. వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకొని, ఆర్గానిక్‌ ఉత్పత్తుల వినియోగం వరకూ.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. వైద్య ఖర్చుల భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ఆహారపు అలవాట్లల్లో తీసుకురావాల్సిన మార్పుల గురించీ వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల నియంత్రణ చేపట్టాలని స్పష్టం చేశారు.

తరచూ వైద్య పరీక్షలు..

టాటా ట్రస్ట్‌-గేట్స్‌ పౌండేషన్‌ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్లు ప్రజారోగ్యంపై ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తాయన్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టుగా టాటా డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా, వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. తిరుపతి, విజయవాడ, విశాఖల్లో సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ వంటి వాటిని పీపీపీ ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఉన్న యోగధ్యాయన పరిషత్తును పునరుద్ధరించాలని ఆదేశించారు. దీనికోసం ఒక సొసైటీని ఏర్పాటు చేయాలన్నారు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, నేచురోపతి, హోమియో, ఆయుర్వేదం, యునాని వంటి సం ప్రదాయ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్నారు.


పోషకాహార లోపాలు గుర్తించాలి..

చిన్న పిల్లల్లో పోషకాహార లోపాలను ముందుగానే గుర్తించేలా కేర్‌ అండ్‌ గ్రో పాలసీని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండాలనే ప్రభుత్వ పాలసీని పక్కాగా అమలు చేయాలన్నారు. గిరిజనులకు వైద్య సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదాద్దాలన్నారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు.

150 పోస్టులకు ఆమోదం..

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విన్నపం మేరకు 150 పోస్టు భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఐపీఎంలో మొత్తం 723 పోస్టులు ఉండగా.. 143 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తొలివిడతగా 150 పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసే అంశాన్ని పరిష్కరించాలని మంత్రికి సూచించారు. ఈమేరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని సీఎం స్పష్టం చేశారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 04:19 AM