Share News

CM Chandrababu: ఆర్థిక ప్రగతికి మద్దతివ్వండి

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:44 AM

ఆర్థిక ప్రగతికి బ్యాంకులు పూర్తి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2025-26కి రూ.6.60 లక్షల కోట్ల వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తూ పేదరిక నిర్మూలనపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు.

CM Chandrababu: ఆర్థిక ప్రగతికి మద్దతివ్వండి

  • బ్యాంకర్లకు సీఎం పిలుపు

  • రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయి

  • వచ్చే నాలుగేళ్లలో సంపద సృష్టి, ఇంటికో పారిశ్రామికవేత్త, పేదరిక నిర్మూలనపై దృష్టి

  • పీపీపీ విధానం విస్తృతంగా అమలు

  • పెట్రో కారిడార్‌పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి

  • మత్స్యకారులకు నేరుగా రుణాలివ్వాలి

  • డ్వాక్రా, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు సాయం చేయాలి

  • రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో సీఎం

  • 2025-26కు 6.60 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల

  • లక్ష్యాన్ని అధిగమిస్తామన్న బ్యాంకర్లు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంపదసృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా వచ్చే నాలుగేళ్లలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. ఓవైపు ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు, రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 2029కల్లా పేదరికం నిర్మూలించేలా జీరో పావర్టీ-పీ4 విధానం అమలు చేసి, అసమానతలు తొలగించేందుకు కృషి చేస్తున్నాం.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి భారీగా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని, స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పని చేస్తూనే.. 2029కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌లు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని, వీటన్నింటికీ బ్యాంకులు సహకారం అందించాలన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 6,60,000 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. అలాగే 2024-25లో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్‌ అధికారులతో చర్చించిన సీఎం.. వంద శాతం లక్ష్యాలను అధిగమించి, దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు వారిని అభినందించారు. అలాగే 2025-26 లక్ష్యాలను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఏరంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరి అని చెప్పారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్ట్‌లకు బ్యాంకులు అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని చెప్పారు.


ఆర్థికాభివృద్ధిలో విశాఖ అనూహ్య పురోగతి సాధిస్తోందని, పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అమరావతిని వేదికగా చేస్తున్నామని, అటు రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ హబ్‌గా, ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పెట్రో కారిడార్‌పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయంతో మత్స్యకారులు నష్టపోతున్నందున వారికి నేరుగా రుణాలు ఇవ్వాలని కోరారు. సముద్ర ఆర్థిక వ్యవస్థలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సాధించవచ్చునని చెప్పారు. దీనికి బ్యాంకర్ల మద్దతు చాలా అవసరం అన్నారు. డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు. 2025-26లో నిర్దేశించుకున్న రుణ ప్రణాళిక లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా తరచూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సేవలు, పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని తెలిపారు. ఏపీవ్యవసాయరంగ ఆధారితరాష్ట్రం కావడం, దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని చంద్రబాబు చెప్పారు.

సీఎం ఆశయాల మేరకు రుణ ప్రణాళికలు: బ్యాంకర్లు

ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ను తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు ఆశయం మేరకు వార్షిక రుణ ప్రణాళికలు అమలు చేస్తున్నామని సమావేశంలో బ్యాంకర్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్వయం సహాయక బృందాలకు రుణాలు విరివిగా అందిస్తామని, విద్యా, గృహనిర్మాణాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, కొండపల్లి శ్రీనివాస్‌, సీఎస్‌ విజయానంద్‌, ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్‌ మణిమేఖలై, పలువురు బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులు పాల్గొన్నారు.


22 శాతం రుణ లక్ష్యం పెంపు

రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం 2024-25లో రూ. 5,40,000 కోట్లు ఉండగా, 2025-26లో 22% అధికంగా రూ. 6,60,000 కోట్లకు పెంచారు. ఇందులో వ్యవసాయరంగ లక్ష్యం రూ. 3,06,000 కోట్లు, ఎంఎ్‌సఎంఈ రంగానికి రూ. 1,28,000 కోట్లు ఉండగా, మొత్తం ప్రాధాన్యత రంగానికి రూ. 4,58,000 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 2,02,000 కోట్లు రుణ లక్ష్యంగా బ్యాంకర్ల కమిటీ నిర్దేశించింది. 2024-25లో లక్ష్యాన్ని అధిగమించి, రూ. 6,83,672 కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్ల కమిటీ వివరించింది. వార్షిక లక్ష్యంలో ఇది 127% వృద్ధి అని తెలిపింది. ఇందులో ప్రాధాన్యత రంగానికి రూ. 4,14,824 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 2,68,848 కోట్లు అందించగా, గతేడాది వ్యవసాయ రంగానికి రూ. 2,64,000 కోట్ల రుణ లక్ష్యంలో 116% వృద్ధి సాధించామని, ఖరీఫ్ఫలో రూ. 1,69,797కోట్లు, రబీలో రూ.1,37,291 కోట్లు రుణాలిచ్చామని బ్యాంకర్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎంఎస్ఎంఈలు రంగానికి భారీఎత్తున రుణ ప్రణాళికఅమలు చేయగా, గతేడాది రూ. 87 వేల కోట్ల లక్ష్యానికి రూ. 95,620 కోట్లు రుణాలు ఇచ్చి, 110% వృద్ధి సాధించారు. అయితే వార్షిక రుణ ప్రణాళిక అమలులో ఏటేటా వృద్ధి రేటు పడిపోతుడటంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బ్యాంకర్లను ప్రశ్నించారు. 2021-22 లక్ష్యంలో 133%, 2022-23లో 163%, 2023-24లో 138% ఉండగా, 2024-25లో లక్ష్యంలో వృద్ధి 127% మాత్రమే ఉండటంపై మంత్రి వివరణ కోరారు.

Updated Date - Apr 30 , 2025 | 06:11 AM