ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బాబు, లోకేశ్ లకు ఓటుహక్కు
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:34 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత పొందారు.
ఇద్దరూ గ్రాడ్యుయేట్లు కావడంతో ఓటర్లుగా నమోదు
పట్టభద్రుడు కాకపోవడంతో పవన్ దూరం
జగన్ తాడేపల్లివాసి అయినా ఓటు పులివెందులలో
గుంటూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ విద్యార్హతలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత పొందారు. చంద్రబాబు శ్రీ వేంకటేశ్వర విఽశ్వవిద్యాలయంలో బీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. లోకేశ్ బీఎస్సీ, ఎంబీఏ పట్టభద్రుడు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో వీరిద్దరు నివశిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకుని, ఓటు హక్కు పొందారు. ఇదే నియోజకవర్గంలో నివసిస్తున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ పట్టభద్రుడు కానందున ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే తాడేపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇక్కడ ఓటు పొందలేకపోయారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తన ఓటును పులివెందులలో వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఓటు ఉంటే అదే ప్రాంతంలో ఎమ్మెల్సీ ఓటు కూడా నమోదు చేసుకోవాలనే నిబంధన ఉంది. చంద్రబాబు, లోకేశ్ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాడేపల్లి మండలం పరిధిలోని గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.