CM Chandrababu: క్రిమినల్స్ కన్నా మెరుగ్గా ఆలోచించాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:13 AM
‘సైబర్ నేరాలు సవాల్ విసురుతున్నాయి.. క్రిమినల్స్ కన్నా పోలీసులు మెరుగ్గా ఆలోచిస్తేనే నేరాలు కట్టడి అవుతాయి.. నేరస్తులకు అవకాశం ఇవ్వొద్దు’ అని సీఎం చంద్రబాబు యువ ఐపీఎ్‌సలు, డీఎస్పీలకు సూచించారు.
ట్రైనీ ఏఎస్పీలు, డీఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘సైబర్ నేరాలు సవాల్ విసురుతున్నాయి.. క్రిమినల్స్ కన్నా పోలీసులు మెరుగ్గా ఆలోచిస్తేనే నేరాలు కట్టడి అవుతాయి.. నేరస్తులకు అవకాశం ఇవ్వొద్దు’ అని సీఎం చంద్రబాబు యువ ఐపీఎ్‌సలు, డీఎస్పీలకు సూచించారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని పోలీసు శాఖలోకి అడుగుపెట్టిన పలువురు ఏఎస్పీలు, డీఎస్పీలు గురవారం రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి కీలక సూచనలు చేశారు.
శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్ ఉండాలి.. ఫ్రెండ్లీ పోలీసింగ్.. అధునాతన టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తూనే నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి’ అని సూచించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా రాష్ట్రంగా ఏపీకి అపఖ్యాతి వచ్చిందని, మత్తు పదార్థాలు కట్టడిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా పగ తీర్చుకోవడానికి గత ప్రభుత్వానికి ఆయుధాలుగా మారారని సీఎం అన్నారు.