Share News

Mock Drill Today: సైరన్‌ మోగగానే అలర్ట్‌

ABN , Publish Date - May 07 , 2025 | 04:28 AM

భద్రతా సన్నద్ధతపై అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం, బాపట్లలో ఈ రోజు సివిల్ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. పాకిస్థాన్‌ ప్రతిదాడి సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ డ్రిల్ ద్వారా తెలియజేస్తారు

Mock Drill Today: సైరన్‌ మోగగానే అలర్ట్‌

  • నేడు విశాఖపట్నం, బాపట్లలో మాక్‌ డ్రిల్‌ నిర్వహణ

విశాఖపట్నం, బాపట్ల, మే 6 (ఆంధ్రజ్యోతి): భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో బుధవారం ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ పేరిట సివిల్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు ఏపీలోని విశాఖపట్నం, బాపట్లలో బుధవారం మాక్‌ డ్రిల్‌ చేపట్టనున్నారు. ఒకవేళ పాకిస్థాన్‌ మనపై ప్రతిదాడి చేస్తే.. ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్‌డ్రిల్‌ ద్వారా అవగాహన కల్పిస్తారు.

విశాఖపట్నంలో ఎందుకు..?

విశాఖలో నౌకాదళ స్థావరం, పోర్టులు, విమానాశ్రయం, ఆయిల్‌ రిఫైనరీలు, స్టీల్‌ ప్లాంటు ఇంకా అనేకం ఉన్నాయి. ఒకవేళ శత్రువు ఈ నగరంపై ప్రతిదాడి చేస్తే ఎలా స్పందించాలి.. అని అవగాహన కల్పించేందుకు సివిల్‌ డిఫెన్స్‌ విభాగం మాక్‌ డ్రిల్‌ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని పాత పోస్టాఫీస్‌ దగ్గరున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ఉమెన్స్‌ హాస్టల్‌, దొండపర్తిలోని రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ కార్యాలయం, విశాఖపట్నం పోర్టు, ఏయూ అవుట్‌ గేట్‌ దగ్గరున్న జేవీడీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీ, వన్‌టౌన్‌లోని క్వీన్‌ మేరీ పాఠశాల పరిసరాలలో డ్రిల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, ఎక్కడ దాక్కోవాలి..?, మిగిలిన వారికి ఎలాంటి సాయం చేయాలి..?, రాత్రి వేళ సైరన్లు మోగితే ఏంచేయాలి..? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.


సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ సారథ్యంలో..

బాపట్లలోని సూర్యలంకలో ఉన్న ఎయిర్‌పోర్స్‌ స్టేషన్‌ అధికారుల సారథ్యంలో బుధవారం మాక్‌ డ్రిల్‌ చేపట్టనున్నారు. దీనిలో మెరైన్‌తో పాటు పోలీస్‌ విభాగం కూడా భాగస్వామ్యం కానున్నాయి. కలెక్టర్‌ వెంకటమురళి మంగళవారం సాయంత్రమే మాక్‌డ్రిల్‌కు సంబంధించి ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతో చర్చించి విధివిధానాలను ఖరారు చేశారు.

Updated Date - May 07 , 2025 | 04:28 AM