life imprisonment: గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి జీవితఖైదు
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:56 AM
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 2019 నాటి గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు.
సూళ్లూరుపేట, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 2019 నాటి గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు. సూళ్లూరుపేట బొగ్గుల కాలనీకి చెందిన తిరువళ్లూరు నవీన్‌కుమార్, సాయినగర్‌కు చెందిన కేకుల దేవకు జీవిత ఖైదుతో పాటు నగదు దోపిడీకి పాల్పడినందుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. శ్రీసిటీలోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్న విజయనగరానికి చెందిన యువతి, కాకినాడకు చెందిన యువకుడు ప్రేమించుకుంటున్నారు. 2019 ఫిబ్రవరి 3న రాత్రి 10.30 గంటల సమయంలో సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ చివర్లో కూర్చొని వీరు పెళ్లి విషయమై మాట్లాడుకొంటున్నారు. అదే సమయంలో నలుగురు యువకులు అతడిపై దాడిచేసి నగదు లాక్కున్నారు. ఆ యువతిని కాస్త దూరం లాక్కెళ్లి గ్యాంగ్‌రే్‌పకు పాల్పడ్డారు. మళ్లీ ఆమెను తడ మండలం అక్కంపేట రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యారు.అప్పట్లో ఈ గ్యాంగ్‌రేప్ సూళ్లూరుపేటలో సంచలనం రేపింది. అప్పటి సీఐ కిషోర్ బాబు,పోలీసులు ఈ ఘట నపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ప్రస్తుత సీఐ మురళీకృష్ణ, కోర్ట్ లైజన్ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ ఎస్‌కే ఖాజాహుస్సేన్ సాక్ష్యాలను సరైన సమయంలో సమర్పించి నేరం రుజువు కావడానికి కృషి చేశారు. ప్రాసిక్యూషన్ తరపున తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఫీ మాలిక్ వాదనలు వినిపించారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు.
మానవ మృగాలకు సరైన శిక్షే పడింది
ఆరేళ్ల కిందట గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష పడడంతో ‘మానవ మృగాలకు సరైన శిక్షే పడింది’ అని స్థానికులు అంటున్నారు. బాధితురాలికి కొంతవరకు న్యాయం జరిగిందని చర్చించుకున్నారు. ప్రియుడి కళ్లెదుటే అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో అప్పట్లో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఈ ఘటనను నిరసిస్తూ ఒక ఉద్యమం నడిచింది. పోలీసులూ రంగంలోకి దిగి మరుసటి రోజే నిందితులను పట్టుకున్నారు. అప్పటి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి వచ్చి బాధిరాలిని పరామర్శించారు. మావన మృగాలకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. ఈ ఘటనతో అప్పటి సీఐ కిషోర్ బాబు, ఎస్‌ఐ విశ్వనాధ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి సూళ్లూరుపేటకు పోలీసులు, స్పెషల్ ఐడిపార్టీ రప్పించి పరిశ్రమలు, బాలికల పాఠశాల, హాస్టల్స్, రైల్వేస్టేషన్ సమీపాల్లో పోలీసుల గస్తీపెంచారు. దాదాపు రెండు నెలల పాటు ఈ ప్రాంతంలో పోలీసు గస్తీ ఉంది. ఈ క్రమంలో ఇద్దరికి జీవత ఖైదు పడటంతో సరైన శిక్షే పడిందని అంటున్నారు.