Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:08 PM
Tirupati Hostel Incident: తిరుపతిలో ఓ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు.
తిరుపతి, ఏప్రిల్ 17: అది లేడీస్ నర్సింగ్ హాస్టల్. రాత్రి సమయంలో విద్యార్థినిలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇదే సమయంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి విద్యార్థినిల హాస్టల్ గదిలోకి దూరాడు. ఏదో అలికిడిగా భావించిన విద్యార్థినిలు ఒక్కసారిగా లేచి కూర్చుకున్నారు. గదిలోకి ఎవరో వచ్చారని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు గదిలోకి వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు. వచ్చింది ఎవరో తెలిసి విద్యార్థినిలు అవాక్కయ్యారు. అసలేం జరిగింది.. విద్యార్థినిల గదిలోకి వచ్చింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుపతిలో అర్ధరాత్రి విద్యార్థినిల గదిలో ప్రిన్సిపాల్ దూరిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్‌లో వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ ప్రిన్సిపాల్ వర్మ అర్ధరాత్రి విద్యార్థినిల గదిలోకి దూరాడు. ఒక్కసారిగా ప్రిన్సిపాల్ గదిలోకి రావడంతో విద్యార్థినిలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని నిర్బంధించారు. అనంతరం ఈ ఘటనపై అలిపిరి పోలీసులకు నర్సింగ్ స్టూడెంట్స్ సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్మను కఠినంగా శిక్షించాలంటూ అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు.
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
అయితే ఈ ఘటనపై మరికొందరు విద్యార్థినిలు మాత్రం వేరేలా చెబుతున్నారు. పక్క భవనంలో దూకిన విద్యార్థినిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొందరు స్టూడెంట్స్ తెలిపారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రిన్సిపాల్ అక్కడకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవాలపై విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం ప్రిన్సిపాల్ వర్మపై అలిపిరి పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన విద్యార్థినిల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ హోదాలో ఉండి ఇలాంటి పనులా అంటూ మండిపడుతున్నారు. హాస్టల్‌లో ఉన్న తమ బిడ్డలకు రక్షణ ఎలా కల్పిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఇలా అర్ధరాత్రి సమయంలో విద్యార్థినిల హాస్టల్‌లోకి దూరడం పెను సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News