TTD Chairman: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
ABN , Publish Date - Nov 18 , 2025 | 02:53 PM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.
తిరుమల, నవంబర్ 18: వైకుంఠ ద్వారా దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం, టికెట్లు, ఏర్పాట్లపై ఈరోజు (మంగళవారం) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల నూతన సంవత్సరం నాడు కేవలం సర్వదర్శనం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ 2 వ తేదీన భక్తులకు డిప్ ద్వారా దర్శన టోకెన్స్ కేటాయిస్తామని చెప్పారు. మొదటి మూడు రోజుల్లో కేవలం దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు.
జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతి నిత్యం 15 వేల ప్రత్యేక దర్శనం టికెట్లను జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే 1000 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తామన్నారు. వైకుంఠ ద్వారాలు తెరిచే 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి మూడు రోజులు 2.1 లక్షల మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు.
డిసెంబర్ 2వ తేదీన లక్కీ డిప్‌లో దర్శన టోకెన్లు కేటాయింపు ఉంటుందన్నారు. నవంబర్ 27న అమరావతిలో శ్రీవారి ఆలయం రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు చేత శంఖుస్థాపన జరుగనున్నట్లు తెలిపారు. పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారించే విధంగా బోర్డు తీర్మానం చేసిందని.. ఈ కేసుపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కుట్ర చేసే బయటకు పంపారు.. కవిత సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్
Read Latest AP News And Telugu News