Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ కేసు.. వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు..
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:39 PM
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న అరెస్ట్‌లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుమల, అక్టోబర్ 30: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో భారీ కుట్ర ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్) గుర్తించింది. రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరస్ట్‌తో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతడి రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్ ప్రస్తావించింది.
2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను చిన్న అప్పన్న సంప్రదించారు. ఆ క్రమంలో నెయ్యి సరఫరా చేసే బోలేబాబా డెయిరీ యాజమాన్యానికి అప్పన్న ఫోన్ చేసి.. ప్రతి కిలో అవు నెయ్యిపై తనకు రూ. 25 కమీషన్ ఇవ్వాలని అప్పన్న డిమాండ్ చేశారు. అందుకు బోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించింది.
ఈ నేపథ్యంలో బోలేబాబు డెయిరీపై అనర్హత వేటు వేసేలా పలు కుట్రలకు చిన్న అప్పన్న పాల్పడ్డాడు. అందులో భాగంగా డెయిరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ డెయిరీపై అనర్హత వేటు వేసేలా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించారు.
ఇలా చిన్నఅప్పన్న కుట్రలతో బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసింది. ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థ ప్రవేశించి.. రూ. 138 అధికంగా కోట్ చేసింది. పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకుంది. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా సిట్ చేర్చింది.