Pensions: కొందరి పాపం.. వీరికి శాపం
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:30 AM
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని కొంతమంది ఉద్యోగులు అభాసుపాల్జేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
చిత్తూరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని కొంతమంది ఉద్యోగులు అభాసుపాల్జేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లను రూ.4 వేల చొప్పున, వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేల చొప్పున, బెడ్ రిడెన్ పెన్షన్‌ను రూ.15 వేల చొప్పున ప్రభుత్వ అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే పింఛన్లు అందుకుంటున్న వారిలో అనర్హులున్నారన్న ఫిర్యాదులతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వెరిఫై చేయించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బయటి జిల్లాలనుంచి వైద్యాధికారులను రప్పించి మరీ పెన్షనర్ల వాస్తవ పరిస్థితిని మదింపు చేసింది.ఇంతవరకూ బాగానే వుంది కానీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొంతమంది పెన్షన్ల కొనసాగింపునకు డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెన్షన్ సెక్షన్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు కింది స్థాయి సిబ్బంది కలిసి వసూళ్లకు పాల్పడ్డారని చెప్పుకుంటున్నారు. రూ.15 వేల పెన్షన్ కొనసాగించేందుకు రూ.25 వేలు, రూ.6 వేల పెన్షన్ కొనసాగించేందుకు రూ.10 వేలు వసూలు చేసినట్లు ప్రచారంలో వుంది.జిల్లాలో 1936 బెడ్ రిడెన్ పెన్షన్లు ఉండగా.. ఇటీవల జరిగిన రీఅసె్‌సమెంట్‌లో 824 పెన్షన్లను మాత్రమే కొనసాగించారు. 783మందికి రూ.6 వేలు వచ్చే వికలాంగ పెన్షన్‌గా మార్చారు. అలాగే 71 మందికి రూ.4 వేలు వచ్చే వృద్ధాప్య పెన్షన్ కిందికి మార్చారు. 233 మంది పెన్షన్లను పూర్తిగా రద్దు చేశారు. అలాగే 35277 వికలాంగ పెన్షన్లు ఉండగా, 4361 పెన్షన్లను రద్దు చేశారు.ఈలోపు వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఘనకార్యం బయటపడడంతో అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది.మరోవైపు చాలామంది తమకు అర్హత వున్నా పెన్షన్ సౌకర్యం రద్దు చేశారని ఆవేదన చెందుతున్నారు.పెన్షన్ కోల్పోయినవారంతా పోయిన సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌కు హాజరై ఆందోళన చేశారు. తామంతా నిజమైన దివ్యాంగులమేనంటూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.కలెక్టర్ సుమిత్‌కుమార్ నేరుగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పెన్షన్ల రద్దు జాబితాను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే
పెన్షన్లు రద్దయిన వారిలో అర్హులని భావిస్తున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. సచివాలయ సిబ్బంది అందించే రద్దు నోటీసును తీసుకుని, ఆ పరిధిలోని పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌తో రెకమెండ్ చేసుకోవాలి. పాత సదరం సర్టిఫికెట్ జత చేసి ఎంపీడీవోకు అందించాలి. ఎన్టీఆర్ భరోసా పోర్టల్‌లో వాటన్నింటినీ ఎంపీడీవో ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత సదరం స్లాట్‌కు హాజరై కొత్త సర్టిఫికెట్ పొందాలి.కాగా పెన్షన్లు రద్దయ్యాయంటూ వికలాంగుల నుంచి అర్జీలు వస్తున్నాయని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన 42 అర్జీలను ఫార్వర్డ్ చేశానన్నారు. అర్హత ఉన్నవారంతా అప్పీల్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
మంచానికే పరిమితమైన ఇతనికిక రూ.4 వేలే
యాదమరి మండలం కాశిరాలకు చెందిన కల్లుగీత కార్మికుడైన వెంకటస్వామి పాతికేళ్ల కిందట కొబ్బరి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. వెన్నుపూస దెబ్బతిని, రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంతవరకు బెడ్ రిడెన్ పెన్షన్ కింద నెలకు రూ.15 వేలు తీసుకునేవాడు. తాజాగా రీఅసె్‌సమెంట్‌లో భాగంగా అతని పెన్షన్‌ను వృద్ధాప్య పెన్షన్‌గా మార్చారు. ఇక నుంచి నెలకు రూ.4 వేలే వస్తుంది. రూ.15 వేల పెన్షన్‌కు పూర్తిగా అర్హుడైన తనను ఎందుకు రూ.4 వేల పెన్షన్‌కు మార్చారో తెలియడం లేదంటున్నాడు.
రెండు కాళ్లు పనిచేయకున్నా పూర్తిగా రద్దు
యాదమరి మండలం కీనాటంపల్లె దళితవాడకు చెందిన సురే్‌షకు పాతికేళ్ల కిందట జరిగిన ప్రమాదంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 2010లో 90 శాతంతో వికలాంగ సర్టిఫికెట్ వచ్చింది. మరొకరు ఎత్తుకుని ట్రై సైకిల్‌లో కూర్చొబెడితేనే కూర్చోగలిగిన ఈయనకు ఇంతవరకు వస్తున్న రూ.15 వేల పెన్షన్‌ను పూర్తిగా తొలగించారు.