Share News

Kunkis: కుంకీలను పులిచెర్లకు పంపరా?

ABN , Publish Date - Sep 12 , 2025 | 02:03 AM

పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలపై గజరాజులు వరుస దాడులు చేస్తున్నాయి.

Kunkis: కుంకీలను పులిచెర్లకు పంపరా?
గతేడాది అక్టోబరులో కల్లూరు సమీపంలో రోడ్డు దాటుతున్న ఏనుగుల మంద (ఇన్‌సెట్లో) దెబ్బతిన్న టమోటా పంటను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు, నేలకూలిన కొబ్బరిచెట్టు (ఫైల్‌ ఫొటోలు)

నిద్రలేని రాత్రులు గడుపుతున్న అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు

కల్లూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో మూడేళ్లుగా పంటలపై గజరాజులు వరుస దాడులు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే వేళ ఏనుగుల గుంపు నాశనం చేస్తుండడంతో అన్నదాతలు వ్యవసాయంపైనే ఆశలు వదులుకుంటున్నారు.ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు తూతూమంత్రంగా నష్టపరిహారం చెల్లించి సరిపెట్టుకుంటున్న అటవీశాఖపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్వల్ప నష్ట పరిహారం కోసం కూడా అనేక మంది రైతులు ఇంకా ఎదురుచూస్తున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలైతే గజదాడుల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పులిచెర్ల మండలంలోని తూర్పు, పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం సరిహద్దులో ఉన్న కల్లూరు, పాతపేట, చల్లావారిపల్లి, బోడిరెడ్డిగారిపల్లి, దేవళంపేట, వెంకటదాసరపల్లి, పాళెం, కమ్మపల్లి, గడ్డంవారిపల్లి, రెడ్డివారిపల్లి, ఎల్లంకివారిపల్లి, పోశంవారిపల్లి, కావేటిగారిపల్లి పంచాయతీల్లో గజదాడులతో పంటలకు అపారనష్టం వాటిల్లుతోంది. ఇక్కడి రైతులు ప్రధానంగా మామిడి, టమోటా, వరి పంటలు పండిస్తుంటారు. ఇటీవల ఏనుగుల గుంపు దాడుల్లో వీటితో పాటు కొబ్బరి, అరటి, వంకాయ, వేరుశనగ పంటలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. మామిడితోటలకు అమర్చిన రాతికూసాలు, డ్రిప్‌ పైపులను కూడా విరిచేస్తుండడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.ఈ మూడేళ్ల కాలంలో 200 హెక్టార్ల వరి, 100 హెక్టార్ల టమోటా , 200 హెక్టార్ల మామిడి ,10 హెక్టార్ల కూరగాయల పంటలు, 500 కొబ్బరిచెట్లు,వందల సంఖ్యలో రాతికూసాలు ధ్వంసమయ్యాయి. ఇక మామిడి సీజన్‌లో మూడేళ్లు కాలంలో ఏనుగుల దాడుల్లో వందల టన్నుల మామిడికాయలు నేలరాలిపోవడంతో రైతులు, లీజుకు తీసుకున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల కట్టడికి కూటమి సర్కారు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించడంతో బాధిత రైతుల్లో ఆశలు చిగురించాయి. గత నెల 7వ తేదీన బంగారుపాళ్యం మండలం కీరమంద, కొదలమడుగు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఆరు కుంకీలతో చేపట్టిన ఆపరేషన్‌ గజ సక్సెస్‌ కావడంతో ఇక పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న గజరాజుల కట్టడికి కుంకీలను తరలిస్తామని అప్పటి డీఎ్‌ఫవో భరణి ప్రకటించారు. దీంతో మండలంలోని గజ బాధిత రైతులు కుంకీల రాకపై ఆశలు పెంచుకున్నారు. అయితే అటవీశాఖ ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు కన్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కుంకీలను రంగంలోకి దింపడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని,ఇంకెంత కాలం తాము పంటలను కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు.


ఆగని పంటల ధ్వంసం

పులిచెర్ల మండలం బోడిరెడ్డిగారిపల్లి పంచాయతీ ఆవులపెద్దిరెడ్డిగారిపల్లి వద్ద బుదవారం రాత్రి పంటలపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో పంటలకు అపారనష్టం వాటిల్లింది. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోని పెద్దవంక నుంచి బయలుదేరిన 14 ఏనుగుల గుంపు పాతపేట మీదుగా ఆవులపెద్దిరెడ్డిగారిపల్లి వద్దకు చేరుకున్నాయి. లవకుమార్‌, వీరయ్య, గోపి, ఆంజి, రామయ్య, రవికుమార్‌కు చెందిన వరిపంటలను ధ్వంసం చేశాయి.వెంకటయ్యకు చెందిన మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి.రాత్రి 12 గంటల సమయంలో ఏనుగుల దాడులను గమనించిన గ్రామస్థులు పొలాల వద్దకు చేరుకొని టపాకాయలు పేలుస్తూ అరుపులు పెట్టారు. అయితే ఏమాత్రం లెక్కచేయని ఏనుగుల గుంపు మరింత రెచ్చిపోతూ పొలాల్లోని గట్లను కూడా ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి చొక్కావారిపల్లి వెళ్లే మార్గంలోని కలబందను తినేశాయి. అక్కడి నుంచి అడవిలోకి తిరుగుముఖం పట్టిన ఏనుగులు గోగులమ్మ వంక వద్దకు చేరుకున్నాయి. గురువారం పగలంతా గోగులమ్మ వంక సమీపంలోని పెద్దవంక వద్ద తిష్ట వేసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.

Updated Date - Sep 12 , 2025 | 02:16 AM