Tirumala: మళ్లీ తెరపైకి పరకామణి కుంభకోణం
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:30 AM
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్‌అదాలత్‌లో రాజీ కుదిర్చిన కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటి అధికారులు, పాలకుల గుండెల్లో గుబులు మొదలైంది.
తిరుమల, సెప్టెంబరు20(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్‌అదాలత్‌లో రాజీ కుదిర్చిన కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటి అధికారులు, పాలకుల గుండెల్లో గుబులు మొదలైంది.
విజిలెన్స్ అధికారి ఫిర్యాదుతో వెలుగులోకి..
శ్రీవారి ఆలయంలోని హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించే పరకామణిలో టీటీడీ అధికారులు, సిబ్బందితోపాటు సేవకులు విధులు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలోనే జరుగుతుంది. వీటిని ఎప్పటికప్పుడు విజిలెన్స్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఈ లెక్కింపులో పెద్దజీయర్ మఠం నుంచి కూడా ఓ వ్యక్తి పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2023 ఏప్రిల్ 29వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో మఠం నుంచి వచ్చిన రవికుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నాడని గుర్తించిన చంద్ర అనే సెక్యూరిటీ గార్డు అప్పటి విజిలెన్స్ ఏవీఎస్వో సతీష్‌కుమార్‌కు సమాచారమిచ్చాడు. దీంతో ఏవీఎస్వోతోపాటు వీఐ సుబ్బరాజు కలిసి రవికుమార్‌ను తనిఖీ చేయగా విదేశీ కరెన్సీని దాచినట్లు గుర్తించారు. 100 డాలర్ల తొమ్మిది నోట్లు(రూ.72 వేలు) ఉన్నట్టు గుర్తించారు. తాను 30 ఏళ్లుగా పెద్దజీయర్ మఠంలో పనిచేస్తున్నానని, గతంలో ఎప్పుడూ తాను ఇలాంటి తప్పులు చేయలేదని రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నివేదికను తిరుమల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమర్పించగా 379, 381 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పోలీస్ ఒత్తిడితో రాజీ
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి 2024 జనవరిలో మండలిలో ఈ కేసు గురించి మాట్లాడుతూ పరకామణి నుంచి దాదాపు రూ.వంద కోట్లు దొంగతనం చేశారని, ఆయన్ను ఉద్దేశపూర్వకంగా కేసు నుంచి తప్పించారని వ్యాఖ్యానించడం తీవ్రస్థాయి చర్చనీయాశ మైంది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టి 2024 జూలైలో నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో 2023 మే 30వ తేదీన తిరుపతి అదనపు జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్డులో ఛార్జ్‌షీట్ దాఖాలా చేయబడిందని పేర్కొన్నారు. తిరుపతి, చెన్నైలో రవికుమార్‌తో పాటు అతని సతీమణి పేరుపై ఉన్న ఏడు ఆస్తులను టీటీడీ విరాళంగా ఇచ్చారని, వాటి రిజిష్ర్టేషన్ పత్రాలను టీటీడీకి అందజేశారని వింగ్ అధికారులు నివేదించారు. కాగా, 2023 సెప్టెంబరు 9వ తేదీన ఏవీఎస్వో సతీష్‌తో పాటు రవికుమార్ కలిసి రాజీకి వచ్చామని కోర్టుకు తెలిపారని, ఈ క్రమంలో ఈ కేసును లోక్‌అదాలత్ కొట్టివేసిందని, అందుకే రవికుమార్‌కు శిక్ష పడలేదని వింగ్ స్పష్టం చేసింది. అయితే అప్పటి పోలీసు అధికారుల ఒత్తిడితో ఈ రాజీ ఒప్పందం జరిగిందని, పోలీసులు ఎందుకు ఇలాంటి ఒత్తిడి తీసుకువచ్చారో తనకు తెలీదంటూ ఏవీఎస్వో సతీష్ కుమార్ రాతపూర్వ కంగా ఇచ్చినట్టు విజిలెన్స్ వింగ్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆస్తుల ధర దాదాపు రూ.40 కోట్లు ఉండవచ్చని అధికారుల ఆంచనా.
లోక్ అదాలత్ తీర్పుపై బ్రేక్
2023లో నమోదైన ఈ కేసుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అనేక వ్యవస్థలు ఉన్న క్రమంలో తప్పుచేసిన వారికి శిక్ష వేయకుండా రాజీ కుద ర్చాడానికి వీరెవరు అంటూ పలు రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు, భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.దాదాపు రూ.200 కోట్లకుపైగా స్వామి సొమ్మును అపహరించిన వ్యక్తిని కేసు నుంచి తప్పించే అధికారం వీరికి ఎవరు ఇచ్చారంటూ మండిపడ్డారు. ఈ కేసుపై విచారణ చేపట్టాలంటూ బీజేపీ నేత, ప్రస్తుత బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా 2024లో ధర్మకర్తల మండలికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే తిరుపతికి చెందిన ఎం.శ్రీనివాసులు పరకామణి వ్యవహారంపై సీఐడీ ద్వారా విచారణ చేయించాలంటూ వేసిన పిటిషన్ ఆధారంగా శుక్ర వారం కేసు విచారణకు వచ్చింది. కౌంటర్‌కు రెండు వారాల గడువు ఇస్తూ లోక్ అదాలత్‌లో ఇచ్చిన ఆదే శాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తీర్పునిచ్చిం ది. ముఖ్యంగా కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో తిరిగి పరకామణి కుంభకోణం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అప్పటి పాలకులు, అధికారులు, సిబ్బంది గుండెల్లో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది.మరోవైపు రాజకీయంగా నూ ఈ వ్యవహారం వేడిని పుట్టిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి.