Elephant: ఆపరేషన్ గజ
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:15 AM
కాలు విరిగి చెరువులో కదల్లేని స్థితిలో ఉండిపోయిన ఒక ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది.
యాదమరి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాలు విరిగి చెరువులో కదల్లేని స్థితిలో ఉండిపోయిన ఒక ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది. వారం కిందట తమిళనాడు రాష్ట్రం నుంచి యాదమరి మండలంలోని కమ్మపల్లె అటవీ బీట్‌లోకి ఒంటరి ఏనుగు ప్రవేశించింది. అడవిలో జారిపడటంతో ఏనుగు కుడికాలు తొడభాగంలో ఎముక విరిగింది. అయినా కష్టంమీద తిరుగాడిన ఏనుగు శనివారం రాత్రి యాదమరి మండలం డీకే చెరువు సమీపంలోని గుడ్డివాని చెరువులోకి దిగింది. ఆ తర్వాత కదల్లేక నీటిలోనే ఉండిపోయింది. ఆదివారం స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి పరిశీలించి ఏనుగును కాపాడేందుకు చర్యలు మొదలుపెట్టారు. పలమనేరు ముసలిమడుగు నుంచి కృష్ణ, అభిమన్యు అనే కుంకీ ఏనుగులను, మావటీలను రప్పించి మధ్యాహ్నం నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్వీ జూపార్కు వైద్యులు డాక్టర్ అరుణ్, డాక్టర్ తోయిబా సింగ్ పర్యవేక్షణలో ముందుగా ఏనుగుకు నొప్పి నివారణ మందులు ఇస్తామని అటవీ అధికారులు తెలిపారు. అనంతరం మత్తు ఇంజక్షన్ ఇచ్చి పొక్లెయిన్ సాయంతో లారీలోకి ఎక్కించి తిరుపతి ఎస్వీ జూ పార్కుకు తరలించనున్నామని అనంతపురం సర్కిల్ సీసీఎఫ్ యశోదాబాయి తెలిపారు. కాగా ఈ ప్రక్రియను చూసేందుకు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. అటవీ సిబ్బందికి ఇబ్బంది తలెత్తకుండా ఎస్‌ఐ ఈశ్వర్ చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి పది గంటలైనా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు తమిళనాడు అటవీశాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మరోవైపు మండల సరిహద్దుల్లో బోడబండ్ల బీట్‌లో 13 ఏనుగుల గుంపు తిష్ఠ వేసి ఉన్నట్లు సమాచారం. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎ్‌ఫవో శ్రీనివాసులు హెచ్చరించారు.
అటు తమిళనాడు అటవీశాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మరోవైపు మండల సరిహద్దుల్లో బోడబండ్ల బీట్‌లో 13 ఏనుగుల గుంపు తిష్ఠ వేసి ఉన్నట్లు సమాచారం. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎ్‌ఫవో శ్రీనివాసులు హెచ్చరించారు.