Collector: ముస్తాబు కలెక్టర్ తవణంపల్లె బిడ్డ
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:24 AM
పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు.
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేసేందుకు పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం గురించి విద్యార్థుల ద్వారా తెలుసుకుని దాని రూపకర్త మన్యం జిల్లా కలెక్టర్ నక్కల ప్రభాకర రెడ్డిని అభినందించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో శనివారం నుంచి ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ముస్తాబు కోసం ప్రతి తరగతి, వసతిగృహంలో ప్రత్యేక కార్నర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.‘ముస్తాబు’ కార్యక్రమానికి పురుడుపోసిన అధికారి నక్కల ప్రభాకర రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లె . కష్టజీవి. పత్రికా విలేకరిగా పనిచేస్తూనే పోటీ పరీక్షలు రాసి గ్రూప్-1 అధికారి అయ్యారు. అంచెలంచెలుగా అనేక హోదాల్లో పనిచేస్తూ ఐఏఎస్ అయ్యారు. రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన పథక రూపకర్త ప్రభాకర రెడ్డి జీవన ప్రస్థానమిది.
కోచింగ్ సెంటర్ ప్రారంభించి..
2001లో చిత్తూరు కేంద్రంగా ఆయన టైమ్స్ అనే ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి ఇక్కడ మ్యాథ్స్ చెప్పేవారు.. తర్వాతి క్రమంలో ఈ ఇన్‌స్టిట్యూట్‌ను తిరుపతిలో కూడా ప్రారంభించారు. 2006లో గ్రూప్-1 పరీక్షల్లో ఉమ్మడి రాష్ట్రంలో 5వ ర్యాంకు తెచ్చుకున్నారు. 2007 బ్యాచ్ గ్రూప్-1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) పోస్టు లభించింది.
సామాజిక, సాహిత్య రంగాల్లో..
సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ ప్రభాకర రెడ్డి చురుగ్గా పాల్గొనేవారు. తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య జిల్లా సమన్వయకర్తగా, జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శిగా సేవలందించారు.ప్రభాకర రెడ్డి మంచి రచయిత కూడా. నవలలు, కథలు రాశారు. చతురలో అచ్చయిన ‘రాలనిపువ్వు’ నవల బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో హీరో జర్నలిస్టే. అస్త్రం అనే పత్రికలో డైలీ సీరియల్ రాశారు. ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్, నవీన పేజీల్లో కథనాలు రాసేవారు. కవి సమ్మేళనాలు, రేడియో కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
ఐఏఎస్ అధికారిగా..
2018లో ఒంగోలు డీఆర్వోగా పనిచేసేటప్పుడు ప్రభాకర రెడ్డికి ఐఏఎస్ ప్రకటించారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి హోదాలో సర్వే సెటిల్‌మెంట్ స్టేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, శాప్ ఎండీగా విధులు నిర్వర్తించారు. రెవెన్యూలో అత్యంత కీలకమైన సీసీఎల్‌ఏ అడిషనల్ చీఫ్ కమిషనర్‌గా చేశాక, ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
‘రెవెన్యూ క్లీనిక్’ ఈయన ఆలోచనే
మాతృశాఖ రెవెన్యూ కావడం, సీసీఎల్‌ఏలో పనిచేసిన అనుభవం తోడవ్వడంతో కలెక్టర్‌గా ఉన్న పార్వతీపురంలో రెవెన్యూ క్లినిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెవెన్యూలోని రకరకాల సమస్యలను కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పరిష్కరిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే ప్రభాకర రెడ్డి పార్వతీపురం జిల్లాలోని జలపాతాలను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు.అక్కడికి వెళ్లే దారుల్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం నెలకు 2 లక్షలమంది వాటిని సందర్శిస్తున్నారు.
ప్రతిచోటా తన ముద్ర
ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సంస్కరణలకు నాంది పలికి, పాలనలో తన ముద్ర వేశారు. మహబూబ్ నగర్‌లో శిక్షణ పూర్తి చేసుకుని జమ్మలమడుగు ఆర్డీవోగా తొలి పోస్టింగ్ తీసుకున్నారు. అక్కడ ఫ్యాక్షన్ కుటుంబాలను కాంప్రమైజ్ చేసి కలిపారు. కర్నూలు యూత్ సర్వీసెస్ సీఈవోగా బాల్య వివాహాల్ని అరికట్టేందుకు ఉద్యమం చేశారు. వికారాబాద్ ఆర్డీవోగా మీభూమి-మీహక్కు, రెవెన్యూ అదాలత్ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రెవెన్యూ శాఖను ఆన్‌లైన్ చేసే విధానంపై ప్రభుత్వానికి చెందిన మనటీవీలో రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇచ్చారు. శ్రీశైలం ఐటీడీఏ పీవోగా గర్భిణుల మరణాలను నిరోధించారు. అక్కడి చెంచులకు ఓటు హక్కును కల్పించి సుమారు 26 మందికి ప్రజాప్రతినిధులయ్యే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి సీఆర్డీఏలో ఐటీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి అక్కడ ఆన్‌లైన్ విధానంలో భూసేకరణ చేశారు.
సొంతూరు తవణంపల్లె
మునెమ్మ, దొరసామిరెడ్డి తల్లిదండ్రులు. 7వ తరగతి వరకు వెంగంపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10 వరకు ఐరాల మండలంలోని ఎం.పైపల్లె ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ చిత్తూరులోని పీసీఆర్ కళాశాలలో, డిగ్రీ పీవీకేఎన్‌లో చదువుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువంతా సాగింది. 1997లో డిగ్రీ పూర్తయ్యాక తిరుపతికి వెళ్లారు.
రిపోర్టర్‌గా కొన్నాళ్లు..
తిరుపతిలో 1998 నుంచి 2001 వరకు కొన్ని పత్రికల్లో విలేకరిగా పనిచేశారు. ఇదే సమయంలో ఎస్వీ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్ డిస్టెన్స్‌లో పూర్తి చేశారు. చదువు ఒక దాహం. ఆ తర్వాత ఆయన ఎంఏ, ఎంబీఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ (మ్యాథ్స్) పూర్తి చేశారు.