Share News

మావోయిస్టు చలపతి మన జిల్లా వాడే!

ABN , Publish Date - Jan 22 , 2025 | 01:42 AM

ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గరియా బంద్‌ జిల్లా కులారిఘాట్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి గారి ప్రతా్‌పరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లావాసి అని తెలియడంతో విస్తృత చర్చ జరుగుతోంది.

మావోయిస్టు చలపతి మన జిల్లా వాడే!
Chalapati

  • తవణంపల్లె మండలం మత్యంపైపల్లె వాసి

  • మదనపల్లె పట్టుశాఖలో పూర్వ ఉద్యోగి

  • సెంట్రల్‌ కమిటీ దాకా ఎదిగిన చలపతి

  • రామచంద్రారెడ్డి గారి ప్రతాపరెడ్డిపై జిల్లాలో చర్చ

చిత్తూరు అర్బన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఒడిశా-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులోని గరియా బంద్‌ జిల్లా కులారిఘాట్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి గారి ప్రతా్‌పరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లావాసి అని తెలియడంతో విస్తృత చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి ఇంకా ఇంత పెద్ద నాయకుడు మావోయిస్టుల్లో ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చలపతి స్వస్థలం అయిన తవణంపల్లె మండలం మత్యంపైపల్లె గ్రామంలో అయితే ఏ వివరాలు చెబితే ఏమవుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చలపతికి తమ ఊరికీ అసలు సంబంధమే లేదని చెబుతున్నారు. అయితే ఈయన అన్న కుమారుడు ఒకరు ఇప్పటికీ గ్రామంలో ఉన్నారు. మరో అన్న మదనపల్లె పట్టుపరిశ్రమ శాఖలో పనిచేస్తున్నారు.అయితే బంధుత్వాలు చెప్పుకోవడానికి వీరు ఇష్టపడడం లేదు. చలపతి తల్లిదండ్రులు మరణించారు. ఆయనకు ఇద్దరు అన్నలని ఒకరు మరణించగా మరొకరు ప్రభుత్వ ఉద్యోగి అని సమాచారం.


70 ఏళ్ల కిందటే..

చలపతి పుట్టకముందే వారి తల్లిదండ్రులు మత్యం పైపల్లె గ్రామాన్ని వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చలపతి తండ్రి, తాత పుట్టింది ఇక్కడే అని, 70 ఏళ్ల కిందటే అప్పట్లో ఉన్న పూరి గుడిసె, ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్ముకుని గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారని, దాంతో వారికి ఈ గ్రామంతో ఎలాంటి సంబంధం లేదని స్థానికులు చెబుతున్నారు.


ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి..

చలపతి మదనపల్లెలో పట్టుశాఖలో పనిచేస్తూ విశాఖ జిల్లాకు బదిలీ అయ్యారని, అక్కడి పరిచయాలే ఆయనను మావోయిస్టుగా మార్చాయని తెలుస్తోంది. ఉద్యోగాన్ని సైతం వదిలేసి అజ్ఞాతజీవితాన్ని ఎంచుకున్నారని, ఆ ప్రాంతానికే చెందిన మావోయిస్టు నాయకురాలు అరుణతో ఆయనకు పెళ్లి కూడా అయ్యిందంటున్నారు.


ఎన్నోసార్లు తప్పించుకుని..

గతంలో అనేక సందర్భాల్లో ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న చలపతి ఛత్తీ్‌సగఢ్‌ ఎన్‌కౌంటర్‌లో బలైపోయారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది దాదాపు వెయ్యిమందికిపైగా కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో మరణించిన 27మందిలో ఆయన ఒకడయ్యారు.


గొప్ప వ్యూహకర్త

అంకితభావం గల గెరిల్లాగా చలపతి మావోయిస్టు పార్టీలో అగ్రనాయకుడిగా ఎదిగారు. మంచి వ్యూహకర్తగా ఆ పార్టీలో పేరు తెచ్చుకున్నారు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబు మీద అలిపిరి వద్ద నక్సల్స్‌ చేసిన దాడిలోనూ చలపతి పాత్ర ఉందని పోలీసులు భావించారు. 2018లో టీడీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను కాల్చి చంపిన ఘటనలోనూ చలపతి సూత్రధారి అని తెలుస్తోంది.ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చలపతి ఒడిశా రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఇతనిపై రూ.కోటి రివార్డును కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈయనను హతమార్చినందుకు కేంద్ర హోం మత్రి ఎక్స్‌ వేదికగా బలగాలను అభినందించారు కూడా. ఇంత కీలకమైన మావోయిస్టు నాయకుడు జిల్లాకు చెందినవాడు కావడం పట్ల జనం దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Readd More Latest Telugu News Click Here

Updated Date - Jan 22 , 2025 | 02:04 PM