Share News

DCCB: డీసీసీబీ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:13 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి 14మంది ఉద్యోగుల సస్పెన్షన్‌, రిమూవల్‌పై హైకోర్టు స్టే మంజూరు చేసింది.సమగ్ర విచారణ పూర్తయ్యేవరకు వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని బ్యాంకు సీఈవోకు ఉత్తర్వులు జారీచేసింది.

DCCB: డీసీసీబీ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి 14మంది ఉద్యోగుల సస్పెన్షన్‌, రిమూవల్‌పై హైకోర్టు స్టే మంజూరు చేసింది.సమగ్ర విచారణ పూర్తయ్యేవరకు వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని బ్యాంకు సీఈవోకు ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డీసీసీబీలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి కూటమి ప్రభుత్వ సూచన మేరకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు.డీఆర్వో మోహన్‌కుమార్‌ నేతృత్వంలో సహకార చట్టం 51వ సెక్షన్‌ ప్రకారం జరిగిన విచారణలో గత వైసీపీ పాలకవర్గం సహకార రంగానికి చేసిన నష్టం బయటపడింది. ఇందుకు బాధ్యులుగా భావించి 48 మంది బ్యాంకు ఉద్యోగులపై వేటుపడింది. ఇందులో 11 మంది ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికాగా, ముగ్గురు సర్వీసు నుంచి తొలగించబడ్డారు. మరో నలుగురు రిటైర్డ్‌ ఉద్యోగులపైన చర్యలకు ఉపక్రమించింది. మిగిలిన 30 మందిపై శాఖాపరమైన చర్యలకు నడుం బిగించింది.అయితే కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏకపక్షంగా బ్యాంకు సీఈవో తమను తొలగించారని, ఎటువంటి సర్వీసు నిబంధనలు పాటించకుండా ఇచ్చిన ఆ ఉత్తర్వులు అన్యాయమంటూ సస్పెన్షన్‌కు గురైన 11మంది, తొలగింపబడిన ముగ్గురు ఉద్యోగులు హైకోర్టు ను ఆశ్రయించారు.వీరి పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సర్వీసు నిబంధనల పాటింపు ఆధారంగా తదుపరి విచారణ జరపాలని, పిటీషనర్ల వాదనలు విని చర్యలు తీసుకోవాలని బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీచేసింది.విచారణ పూర్తయ్యేవరకు వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించడంతో సస్పెన్షన్‌కు గురైన అప్పటి బ్యాంకు సీఈవో, ప్రస్తుతం జీఎంగా వ్యవహరిస్తున్న ఇ. మనోహర్‌ గౌడ్‌, ఏజీఎం టి. చంద్రకళ, చీఫ్‌ మేనేజర్లు జె. సందీప్‌, కె. నవీన్‌ కుమార్‌, కె. త్యాగరాజు, మేనేజర్లు కె. వెంకటేష్‌ బాబు, ఆర్‌. పుష్పలత, ఎం. రమేష్‌, వి. మోహన్‌కుమార్‌, స్టాఫ్‌ అసిస్టెంట్లు పి. లక్ష్మారెడ్డి, మహమ్మద్‌ యాసీన్‌ ఉన్నారు. వీరిలో ఏడుగురు ఇప్పటికే విధుల్లో చేరగా మనోహర్‌ గౌడ్‌, చంద్రకళ, జె. సందీప్‌, ఆర్‌. పుష్పలత రేపోమాపో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. కాగా నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్‌ అయ్యారంటూ పాలకవర్గ తీర్మానంతో తొలగింపబడ్డ డి. జయప్రకాష్‌ (స్టాఫ్‌ అసిస్టెంట్‌), టి. శ్రీలక్ష్మీప్రసన్న (మేనేజర్‌), బి. గురునాథం (స్టాఫ్‌ అసిస్టెంట్‌)లను సైతం విధు ల్లో చేర్చుకుంటూ బ్యాంకు సీఈవో ఉత్తర్వులు జారీచేశారు.


డొమెస్టిక్‌ విచారణకు ఇద్దరి నియామకం

హైకోర్టు సూచనల మేరకు సహకార బ్యాంకు సర్వీసు రెగ్యులరైజేషన్‌ ఆధారంగా డొమెస్టిక్‌ విచారణకు బ్యాంకు సీఈవో శంకరబాబు ఉత్తర్వులు జారీచేశారు. 14 మందిపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు విచారణ అధికారులను నియమించారు. సస్పెన్షకు గురైన 11 మందిలో 10మందిపై విచారణకు జీఎం లిల్లీ కేథరిన్‌ను నియమించగా, ముగ్గురు రిమూవ్డ్‌ ఉద్యోగులపై విచారణకు డీజీఎం వెంకటాచలపతిని నియమించారు. 45 రోజుల్లోగా సమగ్రంగా విచారణ జరిపి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా అప్పటి బ్యాంకు సీఈవో మనోహర్‌ గౌడ్‌పై విచారణకు విచారణ అధికారిని నియమించాలని కోరుతూ ఆప్కాబ్‌కు లేఖ రాసినట్లు సమాచారం.విచారణ నివేదిక ఆధారంగా ఈ 14 మందిపై బ్యాంకు సీఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. విచారణ నివేదికను బ్యాంకు పాలకవర్గ సమావేశంలో, సర్వసభ్య సమావేశంలో అజెండాగా ఉంచి చర్చించిన అనంతరం వారిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:14 AM