Gold medal: జీవిత ఖైదీకి బంగారు పతకం
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:33 AM
కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న జి.యుగంధర్ మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బంగారు పతకం అందుకున్నాడు.
ఏర్పేడు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న జి.యుగంధర్ మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బంగారు పతకం అందుకున్నాడు. ఏర్పేడు మండలం జంగాలపల్లెకు చెందిన ఇతడికి.. ఒక హత్యకేసులో 2011 జూలై 18న జీవితఖైదు పడింది. కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కారాగారంలోకి వచ్చినప్పటి నుంచి ఓల్డ్‌పాటర్న్‌లో రెండు బీఏలు, న్యూపాటర్న్‌లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో రెండు బీఏలు, మూడు ఎంఏలు పూర్తి చేశాడు. కంప్యూటర్ ట్రైనింగ్, కార్పెంటరీ ట్రైనింగ్ స్కిల్ సర్టిఫికెట్లు పొందాడు. ప్రస్తుతం పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులుగా బీఏ పూర్తి చేశాడు. ఇందులో 8.02 జీపీఏ సాధించి బంగారు పతకానికి ఎంపికయ్యాడు. మంగళవారం హైదరాబాదులో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ 26వ స్నాతకోత్సవంలో యుగంధర్‌కు డిగ్రీ పట్టాతో బంగారు పతకాన్ని అందించారు. కడప జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న యుగంధర్ ఓపెన్ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ చూపించి బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉందని జైలు పర్యవేక్షణాధికారి రాజేశ్వర్‌రావు, ఉప పర్యవేక్షణాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు.