Kathari couple: కఠారి దంపతుల హత్య కేసులో నేడు తుదితీర్పు
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:28 AM
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు.
చిత్తూరు లీగల్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు. కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ 2015 నవంబరు 17న నగరపాలక కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు 22 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.2022 నుంచి సాక్షుల విచారణ జరుగుతూ వచ్చింది.ఏ1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఏ2 వెంకటాచపలతి, ఏ3 జయప్రకా్‌షరెడ్డి, ఏ4 మంజునాధ్, ఏ5 వెంకటేశ్‌లపై నేరం రుజువైందని, మిగిలిన 16 మందిపై కేసు కొట్టివేస్తున్నట్లు ఈ నెల 24వ తేదీన తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు చెప్పారు. తదనంతరం నిందితుల వాంగ్మూలాలను తీసుకున్నారు. గురువారం ఈ కేసు వాయిదాకు రాగా వైద్యాధికారులు, పోలీసులు, మానసిక వైద్యులు తమ నివేదికలను సీల్డ్ కవర్లలో వేర్వేరుగా కోర్టుకు అందించారు. ఆ తరువాత న్యాయమూర్తి తన చాంబర్‌కు వెళ్లి ఆ నివేదికలను పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తి కోర్టు హాలుకు రాగా చింటూ తరపు న్యాయవాది విజయచంద్రారెడ్డి మధ్యాహ్నం 3గంటలనుంచి సాయంత్రం 6.45 గంటల వరకు తన వాదనలను విన్పించారు. ఈ తరహా కేసుల్లో సుప్రీం కోర్టు, హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు పత్రాలను న్యాయమూర్తికి సమర్పిస్తూ వాదనలను విన్పించారు.
అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ కూడా వాదనలు విన్పించారు. సుదీర్ఘవాదనలు విన్న న్యాయమూర్తి కేసును శుక్రవారానికి వాయిదా వేస్తూ అదే రోజు తీర్పు వెల్లడిస్తానని చెప్పారు. గురువారమే కోర్టు తీర్పు వెల్లడిస్తుందని చింటూ, కఠారి వర్గాలకు చెందిన వారు కోర్టు వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ కొంత ఉత్కంఠ నెలకొంది. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.