Share News

Elephant : పంటలపై ఏనుగు దాడి

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:07 AM

పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది.

Elephant : పంటలపై ఏనుగు దాడి
ఏనుగు విరిచేసిన కొబ్బరి చెట్టు

కల్లూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్పచెరువు నుంచి బయల్దేరిన ఒంటరి ఏనుగు బాలిరెడ్డిగారిపల్లె వద్దకు చేరుకుంది. నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌రెడ్డి, రామిరెడ్డి, నారాయణరెడ్డికి చెందిన కొబ్బరి, మామిడిచెట్లను విరిచేసింది. ముల్లంగి, బెండ, అలసంద పంటలను నాశనం చేసింది. దేశిరెడ్డిగారిపల్లెలోని గరుడారెడ్డి, తిమ్మారెడ్డికి చెందిన టేకు, ఎర్రచందనం చెట్లను కూకటివేళ్లతో పెకలించింది. ఇదే గ్రామంలోని శిద్దారెడ్డి, రవీంద్రారెడ్డి, కేశవులురెడ్డికి చెందిన మామిడి, కొబ్బరిచెట్లను విరిచేసి, పశుగ్రాసాన్ని తినేసింది. అక్కడినుంచి కమ్మపల్లె వద్దకు చేరుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న విశ్వనాథనాయుడికి చెందిన కోళ్లఫారాన్ని ధ్వంసం చేసింది. పక్కనున్న సుధాకర్‌నాయుడు, శిద్ధయ్యనాయుడికి చెందిన కొబ్బరి, మామిడిచెట్లను విరిచేసి, పశుగ్రాసాన్ని తినేసింది. ఈ క్రమంలో ఒంటరి ఏనుగు చేసిన ఘీంకారంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడినుంచి వచ్చిన మార్గంలోనే అడవిలోకి వెళుతూ పలువురు రైతులకు చెందిన మామిడిచెట్ల కొమ్మలను విరిచేసింది. ఆదివారం పగలంతా సూరప్పచెరువు వద్ద ఒంటరి ఏనుగు సంచరించినట్లు అటవీ సిబ్బంది తెలిపారు. ధ్వంసమైన పంటలను వారు పరిశీలించి.. నష్టపరిహారం మంజూరుకు వివరాలు అందజేయాలని రైతులకు సూచించారు.

Updated Date - Dec 01 , 2025 | 12:07 AM