Share News

Dry waste: పొడి చెత్త తీసుకుని నిత్యావసరాలు

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:22 AM

మనం రోజూ పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్న పొడి చెత్తను భవిష్యత్తులో అలాగే ఎత్తిపెట్టుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా మన వద్దనున్న పొడి చెత్త తీసుకుని మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.

Dry waste: పొడి చెత్త తీసుకుని నిత్యావసరాలు
ఇటీవల చిత్తూరులో స్వచ్ఛరథాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌

చిత్తూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మనం రోజూ పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్న పొడి చెత్తను భవిష్యత్తులో అలాగే ఎత్తిపెట్టుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా మన వద్దనున్న పొడి చెత్త తీసుకుని మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా తిరుచానూరు, కరకంబాడి మేజర్‌ పంచాయతీల్లో దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలో చిత్తూరులో జిల్లాలోనూ అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఈ కార్యక్రమ స్ఫూర్తిని పల్లెలకు సైతం విస్తరింపజేసేందుకు వినూత్న ఆలోచనతోశ్రీకారం చుట్టింది. జూలైలో గుంటూరు గ్రామీణ మండలాన్ని ఎంపిక చేసి స్వచ్ఛ రథాన్ని ప్రవేశపెట్టింది. ఈ రథం వద్ద పారిశుధ్య సిబ్బందికి ఇస్తున్న పొడి చెత్త అందించినవారికి, ఆ చెత్త విలువకు సమానమైన సుమారు 20 రకాల నిత్యావసర సరుకుల్ని అందించడం మొదలెట్టారు. విజయవంతం కావడంతో ఆగస్టులో తిరుపతి జిల్లాలోని కరకంబాడి, తిరుచానూరు మేజర్‌ పంచాయతీల్లో ప్రారంభించారు. ఇటీవల చిత్తూరులో డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుపతి జిల్లాకు చెందిన స్వచ్ఛరథాలను ఇక్కడ పరిశీలించారు.

ఎలాంటి చెత్త తీసుకుంటారంటే

ఇనుముకు సంబంధించిన వేస్ట్‌, పేపర్లు, పుస్తకాలు, అట్ట పెట్టెలు, ప్లాస్టిక్‌ , గాజు సీసాలు, స్టీల్‌, అల్యూమినియం వస్తువులు సహా ఎలాంటి పొడి రకం చెత్త అయినా తీసుకుంటారు.

ఎలాంటి సరుకులు ఇస్తారంటే

కొబ్బరి నూనె , షాంపూలు, సర్ఫ్‌ ప్యాకెట్లు, పెన్‌, పెన్సిల్‌, గోధుమ పిండి, కంది పప్పు, టూత్‌ బ్రష్‌, వేరుశనగ పప్పు, ఉల్లిపాయలు, వంట నూనె ప్యాకెట్లు


నెలాఖరులోగా 7 చోట్ల ఏర్పాటు

స్వచ్ఛ రథాలను తొలుత మేజర్‌ పంచాయతీల్లో... తర్వాత మండలాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.చిత్తూరు జిల్లాలో మొదట వి.కోట పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారం పది రోజుల్లో వి.కోట పంచాయతీలో స్వచ్ఛరథం పనిచేయనుంది. అలాగే నియోజకవర్గానికో మండలాన్ని ఎంపిక చేసి ఏడు చోట్ల రథాలను డిసెంబరు నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రేషన్‌ వాహనాలే స్వర్ణరథాలు

వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తమ పార్టీ కార్యకర్తలకు సబ్సిడీ కింద వాహనాల్ని అందించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఫెయిలవడంతో ఆయా వాహనాల్ని యజమానులు ఇతర అవసరాలకు వాడుకునేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ వాహనాల్ని వృథా చేయకుండా, స్వర్ణరథంగా మారుస్తోంది.

డ్రైవర్లకు రూ.25 వేల గౌరవ వేతనం

మేజర్‌ పంచాయతీల్లోని స్వచ్ఛ రథాల్లో పనిచేసే డ్రైవర్లకు రూ.21 వేల గౌరవ వేతనం, రూ.4 వేల పెట్రోల్‌ ఖర్చులు ఇవ్వనున్నారు. త్వరలో మండలానికో రథాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇలా మండలం మొత్తానికి పనిచేసే డ్రైవర్లకు రూ.25 వేల వేతనంతో పాటు రూ.4 వేల పెట్రోల్‌ అలవెన్సు ఇస్తారు. ఈ మొత్తం నిర్వహణ పంచాయతీరాజ్‌ అధికారులు చూసుకుంటారు.

Updated Date - Dec 12 , 2025 | 12:22 AM