DDO system: రేపటినుంచి డీఎల్డీవో స్థానే డీడీవో వ్యవస్థ ప్రారంభం
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:38 AM
గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ‘డివిజన్ డెవల్‌పమెంట్ ఆఫీస్’ (డీడీవో) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాకు నాలుగు కార్యాలయాలు కేటాయించగా, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలలో ఏర్పాటు చేశారు. నవంబరు 1 నుండి ఈ కార్యాలయాలు పనిచేస్తాయి.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో డివిజినల్ అభివృద్ధి అధికారి (డీఎల్డీవో) వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా పర్యవేక్షణ లేక పల్లెపాలన చాలావరకు పడకేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పాలనాపరంగా సంస్కరణలు చేపట్టింది. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ‘డివిజన్ డెవల్‌పమెంట్ ఆఫీస్’ (డీడీవో) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాకు నాలుగు కార్యాలయాలు కేటాయించగా, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలలో ఏర్పాటు చేశారు. నవంబరు 1 నుండి ఈ కార్యాలయాలు పనిచేస్తాయి. డీఎల్డీవోలకు ప్రత్యేకమైన అధికారాలు అప్పగించి డివిజన్లలో మిగిలిన అన్ని శాఖల పర్యవేక్షణ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక డీడీవో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిలో డీఎల్డీవో (డివిజనల్ పంచాయతీ అధికారి), డ్వామా, ఏపీడీ కార్యాలయాలు ఉంటాయి. చిత్తూరులోని కలెక్టరేట్ సమీపంలో, పలమనేరు, నగరి ప్రాంతాల్లో కొత్త కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కుప్పంలో డీడీవో అధికారి నియామకం జరగనందున అక్కడ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం డివిజన్ స్థాయిలో సేవలందిస్తున్న డీఎల్పీవో ఇకనుంచి డీడీవోలుగా వ్యవహరిస్తారు. ప్రతి డీడీవో కార్యాలయంలో పనుల నిర్వహణ కోసం సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఇద్దరు అటెండర్లను సిబ్బందిగా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ కింద పంపించారు.