Share News

TDP: ఉచిత విద్యుత్తుపై హోరెత్తిన సంబరాలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:20 AM

ఎంతకాలంగానో తామెదురుచూస్తున్న ఉచిత విద్యుత్తు పరిమితిని కూటమి ప్రభుత్వం పెంచడంతో నాయీ బ్రాహ్మణులు సంబరాలు చేసుకున్నారు.

TDP: ఉచిత విద్యుత్తుపై హోరెత్తిన సంబరాలు
ఊరేగింపులో పాల్గొన్న నాయీ బ్రాహ్మణులు

కుప్పం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఎంతకాలంగానో తామెదురుచూస్తున్న ఉచిత విద్యుత్తు పరిమితిని కూటమి ప్రభుత్వం పెంచడంతో నాయీ బ్రాహ్మణులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు అయిన వైద్యం శాంతారాం ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పుర వీధుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని రథంపై ఊరేగించారు.క్షురకర్మ చేసే నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తు పరిమితిని 150 యూనిట్లనుంచి 200 యూనిట్లకు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు కుప్పం చేరుకుని తిరుపతి గంగమాంబ ఆలయంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల క్షేమంకోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు నిలువెత్తు ఫ్లెక్సీని రథంపై ఉంచి ఆర్టీసీ బస్టాండు కూడలిదాకా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులందరూ సన్నాయి, డోలు, శాక్సా ఫోన్‌ వంటి మంగళ వాయిద్యాలతో శ్రావ్యమైన సంగీతం విన్పిస్తూ ఊరేగింపులో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పీఎ్‌స.మునిరత్నం, వైద్యం శాంతారాం, టీడీపీ మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, టీడీపీ నియోజకవర్గ విస్తరణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌బాబు తదితరులు సైతం మంగళ వాయిద్యాలు మోగిస్తూ ఊరేగింపు అగ్రభాగాన పయనించారు.ఆర్టీసీ బస్టాండు కూడలిలో నిర్వహించిన కృతజ్ఞతాపూర్వక సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడితప్పడన్న మాటను మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. బీసీలకు ఎన్నటికీ అండగా నిలిచే పార్టీ టీడీపీయేనన్నారు. కడా సభ్యులు డాక్టర్‌ బీఆర్‌.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సెల్వరాజ్‌, జనసేన నాయకుడు నరేశ్‌ బాబు, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ చంద్రశేఖర్‌, సత్యేంద్ర శేఖర్‌, రామకుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ఆనందరెడ్డి, నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జ్యోతీశ్వరన్‌, నాలుగు మండలాల సంఘం అధ్యక్షులు, నాయకులు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 01:20 AM