Ramakrishna Case: టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. పుంగనూరు పోలీసులకు షాక్..
ABN , Publish Date - Mar 15 , 2025 | 08:08 PM
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేసింది.
చిత్తూరు: జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని రామకృష్ణ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పుంగనూరు సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ సాంబను బాధ్యులుగా పేర్కొంటూ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం వహించి రామకృష్ణ హత్యకు కారణమయ్యారంటూ మండిపడింది. బాధితుడి పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గానూ వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లాలో ఇవాళ (శనివారం) దారుణం జరిగింది. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను వైసీపీ కార్యకర్త వెంకటరమణ అతి కిరాతకంగా హతమార్చాడు. పాత కక్ష్యల నేపథ్యంలో వెంకటరమణ వేట కొడవలి తీసుకుని వెంటపడి మరీ రామకృష్ణను చంపేశాడు. అయితే దాడిలో బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు.
వీడియో రిలీజ్..
అయితే హత్యకు నాలుగైదు రోజుల ముందే బాధితుడు రామకృష్ణ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులంతా వన్ సైడ్‌గా వ్యవహరిస్తూ తనకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులను వీడియో ద్వారా వేడుకున్నాడు రామకృష్ణ. అయినా పోలీసుల నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. వీడియో రిలీజ్ చేసిన రోజుల వ్యవధిలోనే ప్రత్యర్థుల చేతుల్లో రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన సునీతా రెడ్డి.. తండ్రి హత్యపై ఫిర్యాదు..
CM Chandrababu Naidu: రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..