Electricity tower: విద్యుత్ టవరెక్కిన యువకుడు
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:38 AM
దూకేస్తా.. ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన కర్ణాటక యువకుడి ఉదంతం విషాదంగా మారింది.
రేణిగుంట, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): దూకేస్తా.. ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన కర్ణాటక యువకుడి ఉదంతం విషాదంగా మారింది. రేణిగుంట మండలం గురవరాజపల్లిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం కడూరు ప్రాంతానికి చెందిన శివ(27) ఈనెల 27న శ్రీవారి దర్శనానికి బంధువులు, స్నేహితులతో కలిసి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానంటూ వచ్చేశారు. మంగళవారం ఉదయం గురవరాజపల్లిలోని 220 కేవీ విద్యుత్ టవరెక్కిన ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ జయచంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించారు. ఇంతలో అతడి సెల్‌ఫోను కింద పడింది. ఇందులోని నెంబర్ల ఆధారంగా కర్ణాటకకు చెందిన శివగా గుర్తించారు. అతడి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఒకవేళ శివ దూకితే రక్షించడానికి వలను సిద్ధం చేశారు. మరోవైపు పోలీసులు టవర్ ఎక్కేందుకు ప్రయత్నిస్తే వైరును పట్టుకుని వేలాడుతూ దూకేస్తాననేవాడు. చివరకు కిందకు దూకగా.. వలలో ఒడిసి పట్టుకునే సమయంలో టవర్ కమ్మీలు శివ తలకు తగలడంతో అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఇటీవల అల్లం పంటలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయి మానసికంగా కుంగిపోయినట్లు శివ బావ గిరీష్ తెలిపారు. మద్యం తాగిన సమయంలో రెండుమూడు సార్లు ఆత్మహత్యకు యత్నించగా అడ్డుకోగా.. చివరకు తిరుపతిలో తమనుంచి తప్పించుకుని ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.