Share News

kanipakam: వరసిద్ధుడి ఆలయ ప్రాంగణానికి కొత్తరూపు

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:11 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.

kanipakam: వరసిద్ధుడి ఆలయ ప్రాంగణానికి కొత్తరూపు
కాణిపాకం వరసిద్ధుడి ఆలయం

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు. పాత లడ్డూ పోటు, పోలీస్‌ స్టేషన్‌ ఉన్న ప్రాంతంలోకి నూతన పుష్కరిణి రానుంది. పుష్కరిణిని ఇలా మార్చితే ఆలయ ముందు భాగంలో చాలా స్థలం సమకూరుతుంది. అదేసమయంలో పుష్కరిణిని కొత్త హంగులతో నిర్మించడానికి ఆలయ ఇంజనీరింగ్‌ శాఖ వారు రూ.2.90 కోట్లతో అంచనాలను తయారుచేసి దేవదాయశాఖ ఉన్నతాధికారులకు పంపారు. దీనిపై అనుమతులు రాగానే పనులకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే ఆలయం వద్ద మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయడానికీ అవకాశం లభిస్తుంది. అదే జరిగితే కాణిపాకం కొత్త శోభను సంతరించుకుంటుంది. మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ కృషి చేస్తున్నారు. త్వరలో అన్ని అనుమతులు రావాలని స్థానికులు సైతం కోరుకుంటున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 01:11 AM