Commissioner: 7 బంగారు కుటుంబాల దత్తత
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:07 AM
ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు ఎన్.మౌర్య ‘మార్గదర్శి’గా మారారు.
తిరుపతి, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు ఎన్.మౌర్య ‘మార్గదర్శి’గా మారారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ-4 కార్యక్రమం కింద నగరంలో పేదరికం నిర్మూలనకు ఆమె ముందుకొచ్చారు. ఆ బంగారు కుటుంబాల సభ్యులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాల్లో పునాదులు ఏర్పడేందుకు, అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తామని కమిషనరు హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని చిన్నారికి, తండ్రి లేని ఇద్దరు పిల్లలకు, తండ్రి లేని మరో బాలికకు విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఓ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తానని, జీవనోపాధి కోసం ఒకరికి తోపుడు బండి, కిరాణా షాపు పెట్టుకునేందుకు ఆర్థికంగా సాయం అందించేందుకు మౌర్య అంగీకరించారు. నగరంలోని పేదలకు (బంగారు కుటుంబాలు) ఏదో విధంగా సాయం చేసేందుకు మార్గదర్శకులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.