Share News

CM Chandrababu Naidu: మాది అభివృద్ధి యజ్ఞం

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:25 AM

నేను అభివృద్ధి, సేవా రాజకీయాలు నేర్చుకున్నా హత్యా రాజకీయాలు నాకు తెలియవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు........

CM Chandrababu Naidu: మాది అభివృద్ధి యజ్ఞం

ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అది ఆగదు: చంద్రబాబు

  • ఐదేళ్లలో వ్యవస్థలన్నీ పడకేశాయ్‌.. కేంద్ర నిధులూ తేలేదు

  • జగన్‌ ప్రభుత్వం లక్ష కోట్ల అప్పులు చేసి పోయింది

  • కారు కింద పడిన కార్యకర్తను కుక్కపిల్లలా లాగేశారు

  • అంబులెన్స్‌లో చనిపోయాడని ఆయన భార్యతో చెప్పించారు

  • పేదరిక నిర్మూలనకే పీ-4.. 15 లక్షల బంగారు కుటుంబాలే లక్ష్యం

  • పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం

  • రైతులకు 20 వేలు ఇవ్వబోతున్నాం.. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం కుప్పంలోని శాంతిపురం ప్రజావేదికలో ముఖ్యమంత్రి వెల్లడి

శాంతిపురం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘నేను అభివృద్ధి, సేవా రాజకీయాలు నేర్చుకున్నా. హత్యా రాజకీయాలు నాకు తెలియవు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అభివృద్ధి, సంక్షేమ యజ్ఞం చేస్తున్నానని.. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అది ఆగదని తేల్చిచెప్పారు. చిత్తూరు జిల్లాలో తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చిన ఆయన.. బుధవారం సాయంత్రం శాంతిపురంలో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడారు.


వైసీపీ చేసిన విధ్వంసం తలుచుకుంటుంటే భయమేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ పడకేశాయని చెప్పారు. కేంద్ర నిధుల్ని కూడా తీసుకురాలేకపోయారని, పైగా రూ.లక్షల కోట్ల అప్పులుచేసి పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు రాజకీయాలు నేరమయం అయిపోయాయన్నారు. ‘బాబాయిని చంపి మళ్లీ ఆయన కూతురిని ఇబ్బంది పెడుతున్నారు. నా చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్తచరిత్ర అంటూ రాశారు. నేను శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేయను. ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒకరిని కొట్టినట్లు గానీ, చంపించినట్లు గానీ నా పేరు వినిపించిందా’ అని ప్రశ్నించారు. జగన్‌ కారు కింద కార్యకర్త పడిపోతే కుక్క పిల్లను లాగేసినట్లు లాగిపడేశారని, చనిపోయిన వ్యక్తి భార్యను మేనేజ్‌ చేసి.. ‘మా ఆయన కారు కింద పడి కాదు.. అంబులెన్సులో వెళ్తూ మరణించారు’ అని చెప్పించారని ధ్వజమెత్తారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు కృషి చేస్తున్నానని, అందుకే పీ4 విధానానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. రాష్ట్రంలోని 15 లక్షల బంగారు కుటుంబాల కోసం లక్ష మంది మార్గదర్శులను సిద్ధం చేసే బాధ్యత తనదేనన్నారు. ఆడబిడ్డల కష్టం తీర్చేందుకు ఆనాడు దీపం పథకం తీసుకొచ్చానని. ఇప్పుడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని తెచ్చానని చంద్రబాబు చెప్పారు.


ఎక్కడా 4 వేల పెన్షన్‌ ఇవ్వడం లేదు..

మంగళవారం కొవ్వూరు నియోజకవర్గంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి వెళ్లానని. అతడికి డప్పు కళాకారుడి పెన్షన్‌ అందించానని.. చాలా సంతోషమేసిందని చెప్పారు. దేశంలో మరెక్కడా రూ.4 వేల పెన్షన్‌ ఇవ్వడం లేదన్నారు. ‘ప్రతి నెలా 1వ తేదీన గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది. దివ్యాంగులకు అప్పట్లో రూ.3 వేలకు, ఇప్పట్లో రూ.6 వేలకు పెన్షన్‌ పెంచింది నేనే. మంచానికి పరిమితమైన వారికి జీతం తరహాలో నెలకు రూ.15 వేలు అందిస్తున్నా. తల్లికి వందనం విషయంలో మాట నిలబెట్టుకున్నా. ఐదుగురు పిల్లలున్న వారికి కూడా డబ్బులు వేశాం. దీనివల్ల రెండు లాభాలున్నాయి. పిల్లలను బాగా చదివిస్తారు, జనాభా తగ్గకుండా ఉంటుంది. 1, 11 తరగతుల వారికి అడ్మిషన్లు పూర్తయ్యాక డబ్బులు వేస్తాం. రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో పాటు రూ.14 వేలు రాష్ట్ర వాటాగా మొత్తం రూ.20 వేలను అన్నదాతా సుఖీభవ కింద అందించనున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా అమలు చేస్తాం. వైసీపీ హయాంలో కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తున్నాం’ అని వివరించారు.


ఈ ఏడాదే కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు

వరుసగా 9 సార్లు కుప్పం ప్రజలు గెలిపించారని.. దేశంలోనే ఇదొక చరిత్రగా సీఎం పేర్కొన్నారు. హంద్రీ-నీవా కోసం రూ.3,890 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. ఒక ప్రాజెక్టు కోసం ఒకే విడతలో ఇన్ని నిధులివ్వడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరుగలేదన్నారు. ఈ ఏడాది కచ్చితంగా కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు తెస్తామని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టంచేశారు. ‘10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి నియోజకవర్గంగా, సోలార్‌ పవర్‌ ఉత్పత్తి కేంద్రంగా కుప్పాన్ని మారుస్తా. ఎయిర్‌పోర్టును రెండేళ్లలో పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఈ ఏడాది రూ.1,293 కోట్ల నిధులతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని ప్రారంభించాం. ఇందులో రూ.125 కోట్ల పనులు పూర్తయ్యాయి. పురోగతిలో ఉన్న పనులు 2026 నాటికి పూర్తి చేస్తాం’ అని తెలిపారు. అప్పటికే సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన.. ప్రజావేదికకు హాజరైన మహిళలనుద్దేశించి.. ‘మీకు పాలు పిండే టైమయింది. రోజంతా ఎలా ఉన్నా.. సాయంత్రమైతే ఇళ్లకు వెళ్లిపోవాలి. అది నాకు తెలుసు’ అంటూ ముగించారు. కుప్పంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నారు.


సమస్యల తక్షణ పరిష్కారానికి ఆదేశం

ప్రజావేదికలో ప్రసంగించాక.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో భాగంగా చంద్రబాబు బుధవారం రాత్రి శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లెలో ఇంటింటికీ తిరిగారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. రాత్రి 8.15కి మొదలుపెట్టి అర్ధరాత్రి 11గంటలు దాటేవరకు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులను పలుకరించారు. పిల్లలు ఏం చదువుతున్నారు.. పెద్దలకు ఆరోగ్యం ఎలాఉంది.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. ఏమైనా సమస్యలున్నాయా అని ప్రశ్నిస్తూ.. వారి సమాధానాలు ఓపికతో వింటూ ముందుకు కదిలారు. ప్రతి ఇంటి వద్దా కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగారు. విద్య, వైద్యం, ఆర్థిక అవసరమున్న వారికి తక్షణ సాయం అందించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. అనంతరం తన ఇంటికి చేరుకున్నారు. ఆయన గురువారం కుప్పం రూరల్‌ మండలంలో పర్యటిస్తారు.

Updated Date - Jul 03 , 2025 | 05:46 AM