Share News

CM Chandrababu Rayalaseema Plans: నీళ్లపై గొడవలొద్దు

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:47 AM

నీళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి గొడవలూ అవసరం లేదు..

CM Chandrababu Rayalaseema Plans: నీళ్లపై గొడవలొద్దు

రెండు రాష్ట్రాలూ బాగుండాలి.. ఇచ్చిపుచ్చుకుందాం: చంద్రబాబు

  • మల్యాల నుంచి హంద్రీ-నీవాకు నీటి విడుదల

  • గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకు చెప్పాను

  • సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. హంద్రీ-నీవా కాలువతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు.. 33 లక్షల మందికి తాగునీరు

  • భవిష్యత్‌లో శ్రీశైలం నుంచి తిరుమల వరకు కృష్ణా జలాలు

  • సీమ ప్రాజెక్టులకు 12 వేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత టీడీపీదే

  • జగన్‌ 2 వేల కోట్లూ పెట్టలేదు.. సీమను హార్టికల్చర్‌ హబ్‌ చేస్తాం

  • ఓర్వకల్లు-లేపాక్షి మధ్య ఎలకా్ట్రనిక్స్‌, రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమలు

  • కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్‌లకు 5,000 కోట్లు.. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ

  • త్వరలోనే కడప స్టీల్‌ పనులు.. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెడతాం

  • మల్యాల వద్ద వేద మంత్రాలతో సీఎం పూజలు.. కృష్ణమ్మకు జలహారతి

ఓ పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం మాత్ర మే. నాకు మాత్రం సీమ అంటే నీళ్లు, అభివృద్ధి. ఈ ప్రాంతంలో సాగుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో ముందుండేలా చూస్తాం.

లోకేశ్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించారు. దానిని తప్పకుండా అమలు చేస్తాం. సీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్‌డీఏకి అత్యధిక మెజారిటీతో అందించిన విజయాన్ని ఎప్పటికీ మరువం.

- సీఎం చంద్రబాబు

నంద్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘నీళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి గొడవలూ అవసరం లేదు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దాం. రెండు రాష్ట్రాలూ బాగుండాలి. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని తెలంగాణకు చెప్పాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ వద్ద వేద మంత్రాలతో పూజలు చేసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. తర్వాత మూడు మోటార్లను ఆన్‌ చేసి హంద్రీ-నీవా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్‌ హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నదుల అనుసంధానం తన జీవితాశయమని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే.. రాయలసీమలో కరువనేది ఉండదన్నారు. హంద్రీ-నీవా ద్వారా నీరు 600 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్తుందన్నారు. దీని ద్వారా సీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు.. 33 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. ఫేజ్‌-1లో కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు.. మొత్తం 1,98,000 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఫేజ్‌-2లో అనంతపురం జిల్లాలో మరో 33,617 ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు.. వెరసి 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.


భవిష్యత్‌లో శ్రీశైలం నుంచి తిరుమల వెంకన్న వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు గిత్తా జయసూర్య, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఒక్క చాన్స్‌ ఇస్తే..

ఒక్క చాన్స్‌ పేరుతో అధికారం కట్టబెడితే.. ఆ నేత అధికార దాహంతో బాదుడే బాదుడు, నరకుడే..నరుకుడు అనే విధంగా పాలన చేశారు. ఐదేళ్లలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కనీసం రూ.2 వేలు కోట్లు కూడా ఖర్చు చేయలేదు. సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టిన పార్టీ టీడీపీ. గత ఏడాది అధికారంలోకి రాగానే హంద్రీ-నీవాకు ఏకంగా రూ.3,890 కోట్లు కేటాయించి.. 120 రోజుల్లో పనులు పూర్తి చేశాం. మరో 15 రోజుల్లో సీమలోని అన్ని చెరువులను నీటితో నింపే బాధ్యత నాది.

రతనాలసీమగా మారుస్తాం..

రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.. దానిని రతనాలసీమగా మార్చి రాష్ట్రానికే మణిహారంగా తయారుచేస్తా. హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తా. సీమ జిల్లాలను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తా. ఓర్వకల్లు-లేపాక్షి మధ్య ఎలకా్ట్రనిక్స్‌, రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమలు తెస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ల కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటుచేసి దేశం మొత్తానికీ సరఫరా చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం త్వరలోనే మొదలుపెడతాం. సీమలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి.. కనీసం రెండు మెట్ట పంటలు వేసుకునేలా చర్యలు తీసుకుంటాం. వేదవతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి.. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు సాగునీరు ఇస్తాం. గోరకల్లు మరమ్మతులకు రూ.96 కోట్లు ఒస్తాం. అలగనూరు జలాశయాన్ని రూ.36 కోట్లతో పూర్తి చేస్తాం. మిట్టూరులో లిప్ట్‌ ఇరిగేషన్‌ కింద కలవందలపాడు, హంద్రీ-నీవా కాలువ నుంచి 19వ కిలోమీటర్‌లో ఒక లిఫ్ట్‌ పెడితే 6 వేల ఎకరాలు సుభిక్షమవుతాయని రైతులు చెప్పారు. దీని కోసం రూ.60 కోట్లు విడుదల చేస్తాం. ఇవన్నీ చేయాలంటే ప్రజల సహకారం ఎప్పటికీ ఉండాలి.


jhf.jpg

ఆగస్టు 20లోపు స్కూళ్లకు కొత్త టీచర్లు..

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్‌ను కూడా నియమించలేదు. స్కూళ్లలో టీచర్లు లేకుండానే బాగా చదువు చెప్పామంటూ గొప్పలు చెప్పి అందరినీ మోసం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 20లోపు 16,500 మంది కొత్త టీచర్లను స్కూళ్లకు పంపే బాధ్యత నాది. కేంద్రం పీఎం కిసాన్‌ డబ్బులు వేయగానే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాతా సుఖీభవ డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం సదుపాయం కల్పిస్తాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం. వాట్సాప్‌ గవర్నెన్స్‌లో త్వరలో 700కు పైగా సేవలు అందుబాటులోకి తెస్తాం.

కృష్ణమ్మ పరవళ్లు

చంద్రబాబు నీటిని విడుదల చేయడంతో హంద్రీ-నీవా పొడవునా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీమ రైతులతోపాటు కూటమి శ్రేణుల సంతోషం రెట్టింపైంది. తరలివచ్చిన రైతులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సాగునీటి సంఘాల నేతలు తదితరులతో నందికొట్కూరు కిక్కిరిసింది.

ఆ భూతాన్ని ఇక రానివ్వం

కూటమి ప్రభుత్వ రాకతో.. పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తున్నారు. అయితే గతంలో ఉన్న ఆ భూతం మళ్లీ వస్తే.. తమ పరిస్థితి ఏంటని చాలా మంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అయితే భవిష్యత్‌లో ఆ భూతం రాకుండా రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని వారికి హామీ ఇచ్చా. గతంలో లేని విధంగా కేజీ మామిడికి ప్రభుత్వం తరఫున రూ.4 చొప్పున ఇచ్చాం. అయితే మాజీ సీఎం చిత్తూరు వెళ్లి తన పార్టీ నేత తోట నుంచి 5 ట్రాక్టర్లలో మామిడి కాయలు తెచ్చి రోడ్లపై తొక్కించారు. ఇలాంటి వాళ్లకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా..? అజాత శత్రువు వివేకానందరెడ్డిని హత్య చేసి, వాళ్లు చేసిన నేరాన్ని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నాపైనే నెట్టే ప్రయత్నం చేశారంటే.. సామాన్యులు ఓ లెక్కా? మరీ దారుణంగా.. ఇటీవల రౌడీషీటర్‌ ఇంటికి పరామర్శకు వెళ్లి హడావుడి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 06:26 AM