CM Chandrababu Naidu: ప్రజాసేవకే టెక్నాలజీ
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:52 AM
తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసమేనని, మెరుగైన సేవలు వారికి అందాలని అప్పుడు...
వారికి ఉపయోగపడినప్పుడే సార్థకత
వైద్యఖర్చులు పెరిగాయి.. తగ్గించాలి
పేదలకు నాణ్యమైన విద్య అందాలి
టెక్నాలజీతోనే ఇవన్నీ సాధ్యం
‘బిల్‌గేట్స్’తో కలిసి చేపడుతున్న పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసమేనని, మెరుగైన సేవలు వారికి అందాలని అప్పుడు...ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. పేదలకు, మధ్యతరగతికి, రైతాంగానికి ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు సార్థకత అని అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, సమాచారం, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్-2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సామర్థ పెంపు తదితర అంశాల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవలను మరింత దగ్గరచేసే విషయంలో ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి, పురోగతిపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రస్తుత యుగంలో టెక్నాలజీ పెద్దఎత్తున అందుబాటులో ఉందని, దానివల్ల చాలా వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలందిస్తోందని, ఆగస్టు 15 నాటికి 95 నుంచి 97 శాతం ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చేస్తాయని తెలిపారు. ‘‘బిల్‌గేట్స్ ఫౌండేషన్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుసరించే విధానాలకు సంబంధించిన సమాచారముంది. టెక్నాలజీ పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయంలోనూ వారికి నైపుణ్యం ఉంది. అందుకే వారితో కలిసి పనిచేస్తున్నాం.’’ అని వివరించారు.
విద్య, వైద్యం ప్రజలకు భారం కాకూడదు...
వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీని వినియోగించడానికి ప్రత్యేక కారణం ఉందని చంద్రబాబు అన్నారు. ‘‘రాను రాను వైద్యమనేది సామాన్యునికి భారంగా మారింది. కొన్ని రోగాలకు రూ.కోట్లు మేర డబ్బులు అవసరమవుతోంది. ప్రజలపై వైద్యఖర్చుల భారం తగ్గాలి. దీనికోసమే ఆరోగ్య రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించే అంశంపై దృష్టి పెట్టాం.’’ అని తెలిపారు. పుట్టే పిల్లల్లో వైకల్యం మొదలుకొని పోషకాహారలోపాల వరకు గుర్తించడానికి కేర్ అండ్ గ్రో విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యను, తక్కువ ఖర్చుతో పేదలకు, మధ్య తరగతి ప్రజలకు అందించడం టెక్నాలజీతో సులువు అవుతుందన్నారు. పంటలు వేయడం మొదలుకుని పంట అమ్ముకునేంతవరకు రైతులు ఎలాంటి మెళకువలు అనుసరించాలనే అంశంపై పక్కా సమాచారం అవసరమని, డేటా అందుబాటులో ఉంటే... దానికి అనుగుణంగా సాగు చేస్తారన్నారు. ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉందని, ఫైళ్ల క్లియరెన్స్ కూడా ఆన్‌లైన్‌లో చేస్తున్నామన్నారు. మెడికల్ ఎక్యూ్‌పమెంట్ తయారీ చేసే మెడ్‌టెక్‌జోన్ ఏపీలోనే ఉందన్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, దీనికి బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటామని చెప్పారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, బిల్‌గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.