Share News

Minister Coordination: మళ్లీ 95 సీఎం..

ABN , Publish Date - May 06 , 2025 | 04:57 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ 1995 నాటి భేటీలను పునరుద్ధరించారు. మంత్రులతో లంచ్‌ భేటీలు నిర్వహించి, జిల్లాల్లోని సమస్యలను చర్చించారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.

Minister Coordination: మళ్లీ 95 సీఎం..
CM Chandrababu Naidu

  • మంత్రులతో లంచ్‌ భేటీలకు శ్రీకారం

  • తొలి సమావేశంలో ఆనం, అనిత, కొండపల్లి, వాసంశెట్టి

  • ఆయా జిల్లాల్లో సమస్యలపై చర్చ

  • కేడర్‌ ఫిర్యాదుల్లో నిజాలుంటే ఎమ్మెల్యేలతో మాట్లాడండి

  • అవసరమనుకుంటే నా దృష్టికి తెండి

  • ఇక నెలకు 2-3 లంచ్‌ భేటీలు: బాబు

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు తనలో మళ్లీ 1995నాటి సీఎంను చూస్తారని ఇటీవలి కాలంలో పదేపదే చెబుతూ వస్తున్నారు. ఆ మాటలకు తాజాగా కార్యరూపం ఇచ్చారు. మంత్రులతో లంచ్‌ భేటీలను ప్రారంభించారు. సోమవారం నలుగురు మంత్రులతో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి (దేవదాయ), వంగలపూడి అనిత (హోం), కొండపల్లి శ్రీనివాస్‌ (ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాలు), వాసంశెట్టి సుభాష్‌ (కార్మిక, బీమా వైద్య సేవలు) హాజరయ్యారు. వారు ఇన్‌చార్జులుగా ఉన్న జిల్లాలతోపాటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని సమస్యలపైనా వారితో ఆయన చర్చించారు. ముందస్తుగా తెప్పించుకున్న సమాచారంతో వివిధ అంశాలపై మాట్లాడారు. నియోజకవర్గాల్లో టీడీపీ అంతర్గత విభేదాలు.. ఎమ్మెల్యేలు, నేతలకు మధ్య సమన్వయ లోపం.. కూటమి పక్షాల నేతల నడుమ విభేదాలు వంటి అంశాలన్నింటినీ చర్చించారు. సుమారు 2 గంటలపాటు ఈ భేటీ జరిగింది. వాసంశెట్టి సుభాష్‌ కృష్ణా జిల్లాకు, అనిత విజయనగరం జిల్లాకు, ఆనం ప్రకాశం జిల్లాకు, శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లాకు ఇన్‌చార్జిగా ఉన్న సంగతి తెలిసిందే.

  • సుభాష్‌ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి ఇవ్వడంతోపాటు కీలకమైన కృష్ణా జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించామని.. ఆయన మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న అంతర్గత సమస్యలపై వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశించారు.

  • కొండపల్లి శ్రీనివాస్‌ ఇన్‌చార్జిగా ఉన్న శ్రీకాకుళం జిల్లా సమస్యలనూ చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. ఆ జిల్లాకు తక్కువ సార్లు వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. కూటమి పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొండపల్లిని ప్రశ్నించినట్లు తెలిసింది. అనిత ఇటీవల సింహాచలం చందనోత్సవ దుర్ఘటన సమయంలో చొరవ తీసుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయడాన్ని సీఎం ప్రస్తావించి, ఇలాంటి చొరవ మంత్రులందరూ చూపాలని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.


ఇక తరచూ భేటీలు..

ఇకపై ఇటువంటి లంచ్‌ భేటీలను తరచూ నిర్వహిస్తానని సీఎం మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని మార్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటానని, మంత్రులు కష్టపడితేనే ఎమ్మెల్యేలు కూడా సక్రమ మార్గంలో ఉంటారన్నారు. తప్పనిసరిగా పురోగతి చూపించాలని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై కేడర్‌ నుంచి ఫిర్యాదులు వస్తే విచారించాలని.. నిజాలుంటే ఎమ్మెల్యేలతో మాట్లాడాలని మంత్రులకు సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నెలలో కనీసం రెండు మూడు లంచ్‌ భేటీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

మళ్లీ 30 ఏళ్ల తర్వాత..

1995-98 నడుమ చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో సచివాలయంలో ఇలాంటి లంచ్‌ మీటింగ్‌లు నిర్వహించేవారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవడంతోపాటు మంత్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వీటిని వేదికగా ఉపయోగించుకునేవారు. మళ్లీ 30 ఏళ్లకు అదే తరహా భేటీలు ప్రారంభించారు.

CM Chandrababu Naidu


సమన్వయంతో పనిచేశారు..

అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం సచివాయలయంలో కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇదే తరహాలో సమష్ఠిగా, సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. సమన్వయం కోసం అన్ని స్థాయిల్లో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా సభ సజావుగా సాగిందని అధికారులు సీఎంకి తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 07:57 AM