Nara Lokesh: బాబు సారథ్యంలో.. ట్రెండ్ సెట్ చేస్తున్నాం
ABN , Publish Date - May 17 , 2025 | 03:33 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రెన్యూ పవర్ రూ.22 వేల కోట్లతో హైబ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో 2029 నాటికి 72 గిగావాట్ల లక్ష్యంతో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది.
భారీ పెట్టుబడులతో కలల సాకారం
8 నెలల వ్యవధిలోనే దిగ్గజాలను తీసుకొచ్చాం
దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి ‘రెన్యూ’
త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్: లోకేశ్
22 వేల కోట్లతో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
అనంతపురం, మే 16 (ఆంధ్రజ్యోతి): ‘విజనరీ లీడర్ చంద్రబాబు కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడమే కాదు.. రేపటి తరం భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు. ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలు చూశారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం ట్రెండ్‌ను ఫాలో కావడం లేదు. ట్రెండ్ సెట్ చేస్తోంది’ అని మంత్రి లోకేశ్ అన్నారు. అనంతపురం జిల్లాలో రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు తాము చేస్తున్న శంకుస్థాపన.. దేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయిగా అభివర్ణించారు. గుత్తి మండలం బేతాపల్లి గ్రామ సమీపంలో రెన్యూ పవర్ సంస్థ రూ.22వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. స్వయంగా ఎక్స్‌కవేటర్‌తో మట్టి తీసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రెన్యూ పవర్ సంస్థ పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం స్థిరమైన ప్రగతికి చిహ్నమని అన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టు గ్రిడ్లకు విద్యుత్ ఇవ్వడమే కాకుండా నిరుద్యోగ యువతకు, రేపటి వెలుగులకు దారి చూపుతుందని అన్నారు. ఇదొక పరిశ్రమ మాత్రమే కాదని, ఉద్యమమని.. యువత కలలకు, భావి తరాలకు వారధిలాంటిదని వ్యాఖ్యానించారు.

రెన్యూలో ఉత్పత్తయ్యే ప్రతి మెగావాట్ విద్యుత్.. ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందన్నారు. గ్రీన్ పవర్ హౌస్‌గా మారుతున్న మన రాష్ట్రంలో నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన రెన్యూ చైర్మన్-సీఈవో సుమంత్ సిన్హా, సంస్థ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
పునరుత్పాదక ఇంధనంలో సరికొత్త మ్యాప్‌లు!
ఐదేళ్ల విరామం తర్వాత చంద్రబాబు నాయకత్వంలో సమర్థ పనితీరుకు ప్రతీకగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది. దేశ పునరుత్పాదక ఇంధన పటంలో తిరిగి చేరడమే కాదు.. అందులో సరికొత్త మ్యాప్‌లను రూపొందిస్తున్నాం. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మేం కలలు కనడమే కాకుండా.. వాటిని సాకారం చేస్తున్నాం. 8 నెలల వ్యవధిలోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ర్టానికి రప్పించగలిగాం. ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ రూ.1.86 లక్షల కోట్లు పెడుతోంది. టాటా పవర్ రూ.49 వేల కోట్లతో 7 వేల మెగావాట్లు, వేదాంత సేరెంటికా రూ.50 వేల కోట్లతో 10 వేల మెగావాట్లు, ఎస్‌ఏఈఎల్ ఇండస్ర్టీస్ రూ.6 వేల కోట్లతో 1,200 మెగా వాట్లు, బ్లూక్‌ఫీల్డ్ రూ.50 వేల కోట్లతో 8 వేల మెగావాట్ల ఉత్పత్తికి ముందుకొచ్చాయి. రాష్ట్రంపై ఈ కంపెనీల నమ్మకానికి, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాఽధనకు ఏపీ సిద్ధంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు బ్రాండ్ వల్లే రెన్యూ చైర్మన్ ఇంతదూరం వచ్చారు. టీసీఎస్ రాష్ర్టానికి రావడానికీ అదే కారణం. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని రాయలసీమకు తీసుకొస్తాం.
విజనరీ సారథ్యంలో..: రెన్యూ చైర్మన్
పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త శకానికి నాంది పలికామని రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, ప్రగతిశీల పాలన, దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తోందన్నారు. జగన్ పాలనలో ఒక్క మెగా వాట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి కాలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఇందుకు జగన్ సిగ్గుపడాలన్నారు.
ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ పునరుజ్జీవం పోసుకుంది. రెన్యూ ప్రాజెక్టుకు కాంక్రీట్ వేయడ మే కాదు.. ఒక విజన్‌ను రూపొందిస్తున్నాం. క్లీనర్, గ్రీనర్, గ్రేటర్ ఏపీ మా విజన్.
ఒక్క చాన్సు మాయలో పడి జగన్‌కు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం దారితప్పింది. యువత తీవ్రంగా నష్టపోయింది.
- మంత్రి లోకేశ్
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News