CM Chandrababu: లోపాలకు చెక్
ABN , Publish Date - May 20 , 2025 | 03:56 AM
ప్రజల అభిప్రాయాల ఆధారంగా సేవల్లో మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. డేటా అనలిటిక్స్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పనితీరు మెరుగుపరిచే దిశగా సీఎం సమీక్షించారు.
ప్రజలిచ్చే ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు చేయాలి: సీఎం
సవలు, పథకాలపై పూర్తి సంతృప్తి రావాలి
కొన్ని శాఖల్లో పరిస్థితి మెరుగైంది
ఆర్టీసీలో సౌకర్యాలు, సేవలు మెరుగుపడాలి
జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు
డేటా అనలిటిక్స్‌తో ప్రజాభిప్రాయం తెలుస్తుంది
12 కల్లా వాట్సాప్ గవర్నెన్స్‌లో 500 సేవలు
3 ఉచిత సిలిండర్ల సొమ్ము ముందే జమ
పథకాలు, సేవలపై సమీక్షలో ముఖ్యమంత్రి వెల్లడి
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోందని.. అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి రావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ లాంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని చెప్పారు. ఈ లోపాలను సరిచేసేందుకు జూన్ 12 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, వివిధ సేవలపై సోమవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి వారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమీక్షిస్తున్న ఆయన.. తాజాగా రేషన్, దీపం-2, ఏపీఎ్‌సఆర్టీసీ, పంచాయతీ సేవలపై ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్, క్యూఆర్ కోడ్ తదితర విధానాల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంవో కార్యదర్శులతో చంద్రబాబు చర్చించారు.
రేషన్ సరుకుల పంపిణీలో ‘పశ్చిమ’ టాప్
రేషన్ సరుకుల పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ‘మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా’ అనే ప్రశ్నకు 74 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. ‘రేషన్ సరుకుల నాణ్యత ఎలా ఉంది?’అనే ప్రశ్నకు 76 శాతం మంది బాగుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు 62 శాతం మంది లేదని చెప్పగా.. అనేక చోట్ల ఈ సమస్య ఉందని పలువురు వినియోగదారులు చెప్పారు. దీంతో ‘దీపం-2’ పథకం ద్వారా ఏటా ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారులు తమకు కావలసినప్పుడు సిలిండర్ పొందవచ్చని చెప్పారు. వారి నుంచి గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, ఇతర స్థాయిల్లో ఎక్కడా అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని.. తాగునీటిపై 44 శాతం, టాయ్‌లెట్ల నిర్వహణపై 55 శాతం మంది అసంతృప్తి వెల్లడించారని తెలిపారు. బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం, టాయ్‌లెట్ల నిర్వహణపై ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, దీనిని సరిచేసుకోవాలని సూచించారు. ఇక పంచాయతీల్లో గతంతో పోల్చుకుంటే చెత్త సేకరణ మెరుగైందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడిచెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్ట్ తయారీ చేపడతామని తెలిపారు.
ప్రభుత్వ సేవల్లో డేటా అనలటిక్స్ కీలకం..
ప్రభుత్వ సేవల విషయంలో డేటా అనలటిక్స్ కీలకమని సీఎం చెప్పారు. డేటా ఆధారంగా ఆయా శాఖలు తమ పనితీరును క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమర్థంగా విశ్లేషిస్తే.. ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవొచ్చని తెలిపారు. ఉన్నతాధికారులు ఆయా శాఖలపై వచ్చే డేటాపై అనలటిక్స్ ద్వారా సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు.
45 లక్షల మందికి వాట్సాప్ సేవలు
వాట్సాప్ గవర్నెన్స్‌లో 325 సేవలు అందుతున్నాయని.. ‘మన మిత్ర’ ద్వారా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాక 45 లక్షల మంది ఈ సేవలను విజయవంతంగా వినియోగించుకున్నారని చంద్రబాబు తెలిపారు. జూన్ 12వ తేదీ నాటికి 500 సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లో 300 ఎకరాల్లో ప్రభుత్వ ప్రతిపాదిత డ్రోన్ సిటీ ఏర్పాటు కానుందని.. ఇందులో మొదటి దశను 116 ఎకరాల్లో నెలకొల్పుతున్నారని చెప్పారు. ఇందులో భాగస్వాములయ్యేందుకు 38 సంస్థలు ఆసక్తి చూపించాయన్నారు. టెండర్ల ప్రక్రియ జూన్ 12నాటికి పూర్తవుతుందని వివరించారు.