Share News

Chandrababu: ఐకానిక్‌ అమరావతి

ABN , Publish Date - May 07 , 2025 | 06:27 AM

అమరావతిలో ప్రతి బిల్డింగ్‌ డిజైన్‌ ఐకానిక్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి దశాబ్దాల ప్రణాళికతో అడుగులు వేయాలని ఆయన అన్నారు

Chandrababu: ఐకానిక్‌ అమరావతి

ప్రతి బిల్డింగ్‌ డిజైన్‌ ప్రత్యేకత చాటాలి

  • అంతర్జాతీయ సంస్థలతో అమరావతికి బ్రాండ్‌

  • సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో సీఎం

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు అన్నీ ఐకానిక్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశించారు. ప్రతి బిల్డింగ్‌ డిజైన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవి ప్రత్యేకతలు చాటాలని చెప్పారు. ఆర్‌బీఐ, ఇన్‌కంట్యాక్స్‌, నాబార్డ్‌, ఎల్‌ఐసీ కార్యాలయాల భవనాలను చూస్తేనే ఒక మంచి అభిప్రాయం కలగాలన్నారు. డిజైన్ల విషయంలో అవసరమైతే ఆయా సంస్థలతో సంప్రదించి మన ఆలోచనలు పంచుకోవాలని చెప్పారు. రాజధాని ఎలా ఉండాలన్న దానిపై సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిలవాలంటే దాని కోసం అధికారులు ఆలోచనలు, ప్రణాళికలు ఎలా ఉండాలో వివరించారు. గతంలో తన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. 15 డిజైన్లు పరిశీలించి హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ భవనాన్ని ఖరారు చేశామన్నారు. 20 ఎయిర్‌పోర్టులు చూసిన తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును నిర్మించామని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు 5 వేల ఎకరాలంటే.. నాడు తనను విమర్శించని వాళ్లు లేరని అన్నారు. వాటికి భయపడి వెనక్కి తగ్గితే.. హైదరాబాద్‌కు అలాంటి ఎయిర్‌పోర్టు ఉండేదా? అని ప్రశ్నించారు. ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తేనే ఫలితాలొస్తాయని చెప్పారు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిలవాలంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు ఆ స్థాయిలో ఉండాలని సీఎం ఉద్బోంధించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు రాజధానికి వస్తే అమరావతి ఓ బ్రాండ్‌ అవుతుందన్నారు.


పెద్ద సంస్థలను రప్పించాలి..

మూడేళ్లలో రాజధాని కడతాం అని ప్రధాని సమక్షంలో చెప్పామని, అందుకు అవసరమైన వేగం, ప్రణాళిక, విజన్‌తో అడుగులు వేయాలని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, క్రీడా, టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా రాజధాని నిలవాలన్నారు. పెద్ద సంస్థలను రప్పించాలని, వెంటపడి ఒప్పించాలని, దానికోసం వాళ్లతో సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. బిట్స్‌ వంటి సంస్థలను తెచ్చేందుకు తన పరిచయాలతో వారిని సంప్రదించానని తెలిపారు.

క్వాంటమ్‌ వ్యాలీకి 50 ఎకరాలు: మంత్రి నారాయణ

గతంలో 64 సంస్థలకు భూములు కేటాయింపులు పూర్తికాగా మంగళవారం మరో 7 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ సీఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. మొత్తం 71 సంస్థలకు కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలో 1,050 ఎకరాల కేటాయింపులు జరిగాయన్నారు. మంగళవారం జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపగా.. వాటికి సీఆర్డీఏ అథారిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. క్వాంటమ్‌ వ్యాలీకి 50 ఎకరాలు, లా యూనివర్సిటీకి 50 ఎకరాలు, ఇన్‌కంట్యాక్స్‌ ఆఫీ్‌సకు 0.78 ఎకరాలు, ఐఆర్‌సీటీసీకి ఒక ఎకరం, కోస్టల్‌ బ్యాంక్‌కు 0.4 ఎకరాలు, రెడ్‌ క్రాస్‌సొసైటీకి 0.78 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్‌ ఫౌండేషన్‌కు గతంలో 15 ఎకరాలు, వైద్య కళాశాల నిర్మాణానికి ఇప్పుడు మరో 6 ఎకరాలను కేటాయించామన్నారు. ఉద్యోగుల నివాసాల టవర్ల నిర్మాణానికి రూ. 1,732.31 కోట్ల పనులకు, రాజధానిలో 190 ఎంఎల్డీ సామర్థ్యం గల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కు అథారిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. జాతీయ రహదారులకు అనుసంధానం చేసేలా ఇ-13, ఇ-15 రోడ్లను పొడిగించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.

Updated Date - May 07 , 2025 | 06:27 AM