CM Chandrababu: కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:15 AM
రాష్ట్ర అభివృద్ధిని బూరాడపెట్టేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయని, ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
అభివృద్ధిపై బురద చల్లుతున్నాయి
వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి
ప్రజలనూ అప్రమత్తం చేయండి
త్వరలోనే ఇండస్ట్రియల్ పార్కులు
కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కానీ కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రతో ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయి. అభివృద్ధిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉంటూ ప్రజలనూ అప్రమత్తం చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మే 2న ప్రధాని అమరావతి సభపై సోమవారం కూటమి పార్టీల నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చేస్తున్న మంచి పనుల గురించి వివరించే బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకున్నా.. ఎన్ని ఇబ్బందులున్నా అధిగమిస్తూసంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో రైతులకు అన్నదాత కింద పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు ఎలాగైతే ఉండాలో రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి రాజధాని ఉండాలన్నారు. అభివృద్ధి వికేంద్రకరణ ఎన్డీయే విధానం కాబట్టే 2014 నుంచి కేంద్ర విద్యాసంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, ఇదే తమ విధానమని స్పష్టం చేశారు.
తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధాని నగరాల నుంచే 70 శాతం ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. ‘‘మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుంది. అమరావతి అందరిదీ. రాష్ట్రానికి ఆత్మ లాంటిది. మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేద్దాం. రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిపోద్దాం’ అని పిలుపిచ్చారు. సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని.. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేసి ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్’ అనే లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.