బనకచర్లపై అనవసర రాద్ధాంతం
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:47 AM
ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేకుండా పూర్తిగా వరద జలాలపై ఆధారపడి నిర్మించే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి కేంద్రం ఆమోదం లభిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
వరద నీటిని వాడుకుంటే ఎగువ
రాష్ట్రాలకు ఇబ్బందే ఉండదు
తెలంగాణకు ఎలా నష్టమో అక్కడి నేతలు చెప్పలేకపోతున్నారు
రాష్ట్ర జలవనరుల శాఖ ఆక్షేపణ
ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదంపై ధీమా
పర్యావరణ అనుమతులపైనా.. టీఏసీ అంగీకరించగానే డీపీఆర్ రూపకల్పన
అధికార వర్గాల వెల్లడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేకుండా పూర్తిగా వరద జలాలపై ఆధారపడి నిర్మించే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి కేంద్రం ఆమోదం లభిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రాథమిక సమీక్ష జరిపిందని.. గోదావరి వరద నీటిని మాత్రమే వినియోగించుకుంటామని వివరించడంతో సంతృప్తి వ్యక్తం చేసిందని అంటోంది. సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతులు రాగానే సమగ్ర పాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంపై తెలంగాణ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు. ‘గత 50 ఏళ్ల చరిత్రను చూస్తే.. ఏటా సగటున 3,000 టీఎంసీల వరద సముద్రంలోకి వృధాగా పోతోంది. ఇందులో 200 టీఎంసీలు తీసుకోవాలనుకుంటున్నాం. అది కూడా వరద వచ్చిన సమయంలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల్లో తీసుకుంటాం. ఆ నీటిని కరువు ప్రాంతం రాయలసీమకు తరలిస్తాం. దీనివల్ల ఎగువన ఉన్న తెలంగాణకు ఎలా నష్టమో సాంకేతికంగా చెప్పలేకపోతోంది’ అని జలవనరుల శాఖ అంటోంది. ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగానే.. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలోని అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల ఆమోదం కూడా లేదని తెలంగాణ చెప్పడాన్ని తప్పుబడుతోంది. తెలంగాణలోని కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు-రంగారెడ్డి, సమక్క బ్యారేజీలను ఎలాంటి అనుమతులూ లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టలేదా? సమ్మక్క బ్యారేజీ పూర్తయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇప్పటిదాకా టీఏసీ ఆమోదం లభించలేదు. అయితే మనం పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం ప్రారంభ దశలోనే సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి అందజేశాం. ఈ నివేదికను పరిశీలించి అభిప్రాయం చె ప్పాలని గోదావరి పరివాహక రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం పంపింది’ అని గుర్తుచేసింది.
రాజకీయ కారణాలతో అడ్డుకునే యత్నం..
వరద జలాలను మళ్లించడం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేనప్పటికీ .. రాజకీయ కారణాలతోనే ఆ రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా ఏకమై అడ్డుపడుతున్నారని జల వనరుల శాఖ ఆక్షేపించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా రాజకీయ పక్షాలు మాత్రం పోలవరం-బనకచర్లను సమర్థిస్తూ ప్రకటనలు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారంలో ఉండగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బనకచర్లకు సానుకూలంగా ఆయన మాట్లాడకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఏ నష్టం లేని ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం బుధవారమే అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అఖిలపక్ష సమావేశం పెట్టి పథకం ప్రాధాన్యాన్ని పార్టీలకు, రాష్ట్ర ప్రజలకు కూడా వివరించాలని అధికార వర్గాలు, నిపుణులు సూచిస్తున్నారు.