Central Govt: రాష్ట్రానికి మరో 2 లక్షల పీఎం కుసుమ్ కనెక్షన్లు
ABN , Publish Date - May 25 , 2025 | 06:01 AM
రాష్ట్రానికి ‘పీఎం కుసుమ్’ పథకం కింద అదనంగా 2 లక్షల సౌర విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడు సోలార్ పార్కుల ఏర్పాటుకు కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.

సోలార్ పార్కుల ఏర్పాటుకు త్వరలో ప్రత్యేక విధానం
సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హామీ
అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ‘పీఎం కుసుమ్’ పథకం కింద రాష్ట్రానికి అదనంగా 2లక్షల కనెక్షన్లు ఇస్తామని కేంద్ర పునరుద్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లక్ష కనెక్షన్లకు అదనంగా మరో 2లక్షల మేర ఫీడర్ వారీ సౌర విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. వాస్తవానికి పీఎం కుసుమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కనెక్షన్లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే తక్షణమే 2లక్షలు ఇస్తామని కేంద్రం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో మూడు సోలార్ పార్కులు ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. రాయలసీమలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలు, బ్యాటరీ స్టోరేజీ సౌర విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ కారిడార్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారు. దీనిపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.