Chilli Farmers: మిర్చి రైతుకు కేంద్రం అండ!
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:06 AM
మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద మిర్చి కొనుగోళ్లను 25శాతం నుంచి 75శాతం వరకు పొడిగించేందుకు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అనుమతి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
క్వింటాలుకు రూ.11,600 కంటే ఎక్కువ ఇవ్వాలని అడిగాం
మార్కెట్ రేటు, పెట్టుబడి వ్యయానికి మధ్య వ్యత్యాస భారం కేంద్రం పైనే
ఎంఐఎ్‌సను 75శాతం పొడిగించేందుకు చర్యలు: కేంద్ర మంత్రి రామ్మోహన్
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీ
న్యూఢిల్లీ/అమరావతి/శ్రీకాకుళం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): మిర్చి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ రేటుకు, పెట్టుబడి వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని భరిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టమైన హామీ ఇచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద మిర్చి కొనుగోళ్లను 25శాతం నుంచి 75శాతం వరకు పొడిగించేందుకు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అనుమతి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని కృషిభవన్‌లో మిర్చి రైతుల సమస్యలపై చర్చించేందుకు శివరాజ్‌సింగ్ చౌహాన్, రామ్మోహన్‌నాయుడు, కేంద్ర వ్యవసాయ అధికారులతో పాటు గుంటూరుకు చెందిన మిర్చి రైతు బండారు శ్రీనివాసరావు భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవసాయ అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం రామ్మోహన్‌నాయుడు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని శివరాజ్‌సింగ్‌ను కోరినట్లు తెలిపారు. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని లెక్కిస్తే క్వింటాలుకు రూ.11,600 వచ్చిందని, అయితే అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. మిర్చి ఉత్పత్తి వ్యయ ధరను పెంచాలని ఐసీఏఆర్ అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారని చెప్పారు.
మిర్చి ఎగుమతులను ప్రోత్సాహించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి అమలుపైనా చర్చించామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో ఒక సదస్సు ఏర్పాటుచేసి, వారి సమస్యలు తెలుసుకుని, సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తక్షణమే మిర్చి ఎగుమతులను పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానించడంపై వచ్చే సలహాలు, సూచనలు అమలు చేస్తామని శివరాజ్‌సింగ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని రైతు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మిర్చికి నల్ల తామర సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేంద్రం తక్షణమే దీని నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, మిర్చి ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.11,600గా లెక్కించగా, దీనికి అదనంగా కూలీ రేట్లు, రవాణా ఖర్చులు పెరిగిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పూర్తి వివరాలు పంపితే, ఐసీఏఆర్‌తో సమీక్షించి, ఉత్పత్తి వ్యయాన్ని నిర్ధారించి, ధరలో వ్యత్యాసానికి సాయం చేయడం ద్వారా రైతులను ఆదుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. అలాగే మిర్చి ఎగుమతులకు చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News