Share News

Horticulture: ఉద్యాన రైతులకు ప్రోత్సాహం

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:46 AM

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వినియోగించుకుని ఉద్యాన రైతులను లాభాల బాటలో నడిపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాలు 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న సీఎం చంద్రబాబు నిర్దేశంతో వృద్ధి రేటు, జీవీఏలో కీలక పాత్ర పోషించే ఉద్యానశాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు సమాయత్తం చేశారు.

Horticulture: ఉద్యాన రైతులకు ప్రోత్సాహం

ఉత్పత్తిని పెంచి, నాణ్యమైన దిగుమతి సాధించేలా ఉద్యానశాఖ ప్రణాళికలు

ఏటా 12% తోటల విస్తీర్ణం పెంపు లక్ష్యం

నష్టాల నివారణకు సాంకేతికత సాయం

అనుగుణంగా పలు పథకాలతో కార్యాచరణ

బడ్జెట్‌లో రూ.1,856.62 కోట్ల కేటాయింపు

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పండ్ల తోటల రైతులను ప్రోత్సహించి, ఉత్పత్తి పెంచి, నాణ్యమైన దిగుబడి సాధించి, డిమాండ్‌ మేరకు ఎగుమతులు చేసేలా ఉద్యానశాఖ ప్రణాళికలు అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వినియోగించుకుని ఉద్యాన రైతులను లాభాల బాటలో నడిపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాలు 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్న సీఎం చంద్రబాబు నిర్దేశంతో వృద్ధి రేటు, జీవీఏలో కీలక పాత్ర పోషించే ఉద్యానశాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు సమాయత్తం చేశారు. దీంతో 2025-26లో రైతులకు అమలు చేయాల్సిన పథకాలతో ఉద్యానశాఖ డైరెక్టర్‌ కె.శ్రీనివాసులు ప్రణాళికలు రూపొందించారు. అత్యధిక నికర విలువ జోడింపు (జీవీఏ) లభించే 11 రకాల ఉద్యాన పంటలను క్లస్టర్‌ విధానంలో ప్రోత్సహించాలని ఉద్యానశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏటా 15ు వృద్ధి రేటు వచ్చేలా మేలైన ఉద్యాన పంటలు, క్లస్టర్లను ఎంపిక చేసింది. ఏటా 10-12ు తోటల విస్తీర్ణం పెంచడం ద్వారా ఉత్పాదకత 5-8ు పెంచడం, పంట కోత అనంతర నష్టాలను నివారించేందుకు సాంకేతికతను జోడించి, 3-5ు వృద్ధి రేటు పెరిగేలా కార్యాచరణ చేపట్టారు.


బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఇలా..

2025-26లో ఉద్యాన శాఖకు కూటమి ప్రభుత్వం రూ.1,856.62 కోట్లు కేటాయించింది. దీంతో పంట వైవిధ్యం ద్వారా లక్షన్నర ఎకరాలు ఉద్యాన వాణిజ్య పంటల కిందకు తేవడం, సూ క్ష్మసేద్యం కిందకు అదనంగా 3.75 లక్షల ఎకరా లు తీసుకురావడం, రూ.1,224.23 కోట్లతో రైతులకు రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలు అందించడం, ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.278.96 కోట్లు, ఆయిల్‌పామ్‌ తోటల పెంపకానికి రూ.330.90 కోట్లు, వెదురు పెంపకం, జీవనోపాధికి రూ.3.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.

సూక్ష్మ సేద్యానికి సబ్సిడీతో ఊతం

2024-25లో 85 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలుకు 80 వేల మందికి పైగా రైతులకు అనుమతి ఇచ్చారు. 2025-26లో ఆర్‌కేవీవై-పీఎండీసీ కింద రూ.1,224 కోట్లతో లక్షన్నర హెక్టార్లను సూక్ష్మసేద్యం కిందకు తీసుకురావాలని ఉద్యానశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం ద్వారా ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కింద 2025-26లో రైతులకు ఇచ్చే డ్రిప్‌, స్పింక్లర్ల సబ్సిడీని ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రిప్‌ పరికరాలను ఎస్సీ, ఎస్టీల్లో చిన్న, మధ్యస్థ రైతులకు ఐదెకరాల వరకు 100ు, ఇతర చిన్న, మధ్యస్థ రైతులకు 90ు, రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు, ఐటీడీఏ పరిధిలో 5-10 ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90ు, కోస్తా జిల్లాల్లో 5-10 ఎకరాల మధ్యస్థ రైతులకు 70ు, పెద్ద రైతులకు 50ు సబ్సిడీ ఇవ్వనున్నారు. స్పింక్లర్లను అన్ని క్యాటగిరీల రైతులకు 50ు సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీలో 27 నుంచి 33ు కేంద్రం, 17 నుంచి 67ు రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి.


ఆయిల్‌పామ్‌ విస్తరణకు ప్రణాళిక

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం 2.27 లక్షల హెక్టార్లు ఉండగా, ఉత్పత్తిలో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2024-25లో 17 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ తోటలు విస్తరించి, 17 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. 2025-26లో 31,530 హెక్టార్ల లక్ష్యంతో రూ.331 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. కోకో అభివృద్ధికీ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నేషనల్‌ బ్యాంబూ మిషన్‌ కింద 2025-26లో రూ.3.12 కోట్లతో వెదురు మొక్కల నర్సరీలు ఏర్పాటు చేసి, వెదురుతో తయారు చేసే వస్తువులతో లబ్ధిదారులకు ఉపాధి చూపనున్నారు. పండ్ల తోటల్లో చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన అధికారులు క్షేత్రస్థాయి సందర్శనలు చేపడుతున్నారు.


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 02:46 AM