Tiruchanur: కారులోనే కడతేరారు
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:24 AM
వారిద్దరూ అన్నదమ్ములు.. ఆదివారం కావడంతో బీర్లు తెచ్చుకున్నారు. ఎవరూ చూడకుండా కారులో కూర్చుని తాగారు. కొద్దిసేపటికే మత్తులోకి జారుకున్నారు.
డోర్లు బిగించుకుని బీర్లుతాగి మత్తుగా నిద్రలోకి
ఇంధనం నిండుకోవడంతో ఆగిన ఏసీ
ఊపిరాడక కారులోనే అన్నదమ్ముల మృతి
తిరుచానూరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ అన్నదమ్ములు.. ఆదివారం కావడంతో బీర్లు తెచ్చుకున్నారు. ఎవరూ చూడకుండా కారులో కూర్చుని తాగారు. కొద్దిసేపటికే మత్తులోకి జారుకున్నారు. ఈలోగా పెట్రోల్ అయిపోయి కారు ఆగడంతో ఏసీ పనిచేయలేదు. దీంతో ఊపిరాడక ఆ ఇద్దరూ మృతిచెందారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో ఈ సంఘటన చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... బుచ్చినాయుడు కండ్రిగ మండలం గోవిందప్పనాయుడు కండ్రిగకు చెందిన దిలీప్ (25), వినయ్ (20) వరుసకు అన్నదమ్ములు. దిలీప్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. తిరుపతి గోపాల్‌రాజుల కాలనీలో ఉంటూ.. తిరుచానూరు కాలువగడ్డ వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకు భార్య, పిల్లలున్నారు. వినయ్ టీటీడీ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వారు బీరుబాటిళ్లు తెచ్చుకున్నారు. దిలీప్ ఇంటి వద్ద ఉన్న కారుపై పట్టా కప్పి.. లోపలకు వెళ్లి డోర్లు వేసుకున్నారు. కారులో ఏసీ ఆన్ చేసుకుని అర్ధరాత్రి వరకు మద్యం తాగారు.
ఆ తర్వాత మత్తులోకి జారుకున్నారు. కారులో పెట్రోల్ అయిపోవడంతో ఇంజన్, ఏసీ ఆగిపోయాయి. అద్దాలు మూసి ఉండడం, కారు డోర్లు కూడా లాక్ కావడంతో ఊపిరాడక ఆ ఇద్దరూ మృతిచెందారు. సోమవారం ఉదయం దిలీప్ భార్య జ్యోతి, బంధువులు కారు వద్దకు వచ్చి చూడగా దిలీప్, వినయ్ విగత జీవులుగా పడిఉన్నారు. మరో తాళంతో కారు డోర్ ఓపెన్ చేసి ఇద్దరినీ బయటకు తీయగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న తిరుచానూరు ఎస్‌ఐ సాయినాథ్ చౌదరి సంఘటనా స్థలానికి చేరుకుని దిలీప్, వినయ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.