Bomb Squad Search: బెజవాడ, విశాఖల్లో బాంబు బెదిరింపు కలకలం
ABN , Publish Date - May 25 , 2025 | 05:44 AM
విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

బీసెంట్ రోడ్డు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు
పోలీసు కంట్రోల్ రూంకే ఫోన్‌చేసిన ఆగంతకుడు
విశాఖలో ఎల్‌టీటీకి బెదిరింపు
విజయవాడ, విశాఖపట్నం మే 24 (ఆంధ్రజ్యోతి): బెజవాడను శనివారం బాంబు బెదిరింపు కాల్ కలవర పెట్టింది. అలాగే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రె్‌సలో బాంబు పెట్టిన ట్లు ఫేక్ కాల్ రావడంతో విశాఖ రైల్వేస్టేషన్‌లోనూ కలకలం రేగింది. చివరికి ఎక్కడా ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం విజయవాడ బీసెంట్ రోడ్డు, రైల్వేస్టేషన్‌లలో బాంబులు అమర్చినట్టు ఓ ఆగంతకుడు పోలీసు కంట్రోల్ రూముకే ఫోన్ చేశాడు. హిందీలో మాట్లాడిన ఆగంతకుడు.. ముందుగా బీసెంట్ రోడ్డు పేరు చెప్పాడు. తర్వాత స్టేషన్.. అని మాత్రమే చెప్పి ఫోన్ కట్ చేశాడు. అప్రమత్తమైన కంట్రోల్ రూం సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. వా రు స్థానిక పోలీసులతోపాటు సిటీ సెక్యూరిటీ వింగ్, ఏఆర్, బాంబు డిటెక్టివ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఆగంతకుడు స్టేషన్.. అని చెప్పడంతో పోలీసులు రైల్వేస్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. అణువణువూ జల్లెడ పట్టారు. రాఘవయ్య పార్కు నుంచి ఏలూరు రోడ్డు వర కు ఉన్న బీసెంట్ రోడ్డు మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా బాంబు ఛాయలు గానీ, దాని మూలాలు గానీ కనిపించలేదు.
విశాఖ స్టేషన్‌లో తనిఖీలు..
ముంబై నుంచి విశాఖపట్నం వస్తున్న రైలు(18520)లో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో శనివారం విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఆ రైలులో బాంబు ఉందని రైల్వే అధికారులకు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం తో జీఆర్‌పీ, టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేయగా ఏమీ లేదని తేలింది.