East Godavari: తూర్పున బర్డ్‌ఫ్లూ పంజా..!
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:53 AM
నిడదవోలు నియోజకవర్గ పరిధి పెరవలి మండలం కానూరు అగ్రహారం కోళ్లఫారంలో... బర్డ్‌ఫ్లూ సోకడంతో సుమారు 62 వేల కోళ్లు మృతిచెందాయి.
తూర్పున బర్డ్‌ఫ్లూ పంజా!
కానూరు అగ్రహారంలో 62 వేల కోళ్లు మృతి
బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ.. కిలోమీటరు మేర రెడ్ జోన్
10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్
పెంపుడు పక్షులను చంపేయాలన్న అధికారులు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. నిడదవోలు నియోజకవర్గ పరిధి పెరవలి మండలం కానూరు అగ్రహారం కోళ్లఫారంలో... బర్డ్‌ఫ్లూ సోకడంతో సుమారు 62 వేల కోళ్లు మృతిచెందాయి. చనిపోయిన మూడు కోళ్ల శాంపిల్స్‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ హైసెక్యూరీటీ డిసీజ్ డయాగ్నోసిస్ లేబొరేటరీకి పంపించగా రెండింటికి బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ నిర్ధారణ అయింది. కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ర్టీలో ఈ నెల 1 నుంచి కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. సమాచారం అందుకున్న కాకినాడకు చెందిన లేబోరేటరీ సిబ్బంది 83 శాంపిల్స్ (చనిపోయిన 3 కోళ్ల శాంపిల్స్‌తోపాటు 40 కోళ్ల ముక్కు శాంపిల్స్, మరో 40 కోళ్ల రెట్ట శాంపిల్స్)ను సేకరించి భోపాల్ ల్యాబ్‌కు పంపించారు. చనిపోయిన మూడు కోళ్లలో రెండింటికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. మిగతా శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. కాగా, సీతానగరం మండలం మిర్తిపాడు, నల్లజర్ల, చాగల్లు మండలాల్లో ఉన్న ఫారాల్లో కూడా కోళ్లు చనిపోతున్నట్టు చెబుతున్నారు. ఇంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని బాదంపూడి, తణుకు సమీపంలోని వేల్పూరులో కూడా బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపించారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు. దీంతో కోడిమాంసం, గుడ్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తూర్పుగోదావరి జిల్లాలో 250 కోళ్ల ఫారాల్లో 2.60 కోట్ల కోళ్లు ఉన్నాయి. బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కానూను అగ్రహారం గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొద్దిరోజుల పాటు చికెన్, గుడ్లు తినడం మానేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో ఒక కిలోమీటరు మేర రెడ్ జోన్‌గా, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్‌గా ప్రకటించామన్నారు. 144, 133 సెక్షన్లు అమల్లోకి తెచ్చినట్టు తెలిపారు. ఎక్కడ పక్షలు చనిపోతున్నా వెంటనే అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. ఇప్పటికే కానూరు అగ్రహారంలో కిలోమీటరు పరిధిలోని కోళ్లను, గుడ్లను కాల్చి వేయాలని ఆదేశించారు. పౌలీట్రీలలో పనిచేస్తున్న వారికి పరీక్షలు చేయాలన్నారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశామని, అక్కడ 9542908025 నంబర్‌లో డాక్టర్ భరత్ అందుబాటులో ఉంటారని చెప్పారు.
ఇది మనుషులకూ వ్యాపించవచ్చు..
‘బర్డ్‌ఫ్లూ అంటువ్యాధి.. ఇది మనుషులకూ వ్యాపించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి’ అని పశుసంవర్థక శాఖ జేడీ టి శ్రీనివాసరావు చెప్పారు. కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారంలో పనిచేసిన వారికి పరీక్షలు చేయగా వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు. ఈ గ్రామంలో కిలోమీటరు మేర పెంపుడు పక్షులన్నింటినీ చంపేసి గొయ్యితీసి పాతిపెట్టాలని ఆయన సూచించారు.
ఆందోళన వద్దు: మంత్రి దుర్గేష్
కానూరు అగ్రహారంలో కోళ్లకు వైరస్ సోకడం వల్ల అధికారులు నివారణ చర్యలు చేపట్టారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కొద్దిరోజుల పాటు చికెన్, గుడ్లు తినొద్దని చెప్పారు. పౌల్ర్టీ రైతులు బయో సెక్యూరిటీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
బర్డ్‌ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు
చనిపోయిన కోళ్లలో హెచ్5ఎన్1 వైరస్
రాష్ట్రంలో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని నిర్ధారణయింది. పక్షం రోజులుగా ఉభయగోదావరి జిల్లాలను వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1) అని భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం 25 లక్షల పైగా కోళ్లు చనిపోయాయి. తాజాగా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో 50వేల కోళ్లు మృతిచెందాయి. కాకినాడ, ఏలూరు పశుసంవర్ధకశాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్తనమూనాలు తీసి భోపాల్‌లోని ఎన్‌ఐహెచ్‌ఎ్‌సఏడీ ల్యాబ్‌కు పంపారు. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్5ఎన్1 పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయింది. పశుసంవర్ధకశాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు సోమవారం ఏపీ పౌల్ర్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల కోళ్ల పెంపకందారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కాగా, కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందని పశువైద్యులు భావిస్తున్నారు. పౌల్ర్టీల్లో యజమానులు జీవభద్రతా చర్యలు పాటించకపోవడం, చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయకపోవడం కూడా వ్యాధి విస్తరణకు కారణంగా చెబుతున్నారు. వైరస్ సోకని కోడి మాంసాన్ని, గుడ్లును బాగా ఉడికించి తినాలని పశువైద్యులు సూచించారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?